అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న “పోలీస్ వారి హెచ్చరిక” చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో శ్రీకాంత్ తన నివాసం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “టైటిల్ ఎంత ఇంట్రస్ట్ గా ఉందో ఫస్ట్ లుక్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందని, ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారని, కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక పోలీస్ ను తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉందని , ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని” అన్నారు..
“సినీ పరిశ్రమలో నేను అన్నయ్య అని పిలిచేది హీరో శ్రీకాంత్ గారిని మాత్రమేనని, మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా “పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని” దర్శకుడు బాబ్జీ అన్నారు. నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ “ఎప్పటికైనా హీరో శ్రీకాంత్ గారితో ఒక ఫోటో దిగాలనుకున్నాను , అటువంటిది యీ రోజు నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నే ఆయన ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం. గతంలో కూడా హీరో శ్రీకాంత్ గారు మా సినిమా నుండి క్యారెక్టర్లు చేస్తూ ఎంతగానో సహాయపడ్డారు” అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.