సుయ్… మంటే నాకొక అట్టు అన్నట్టుంది ప్రస్తుత మీడియా పరిస్థితి.. ప్రపంచమంతా రకరకాల సమస్యలతో తగలబడి పోతుంటే వెటరన్ ప్రేమికుల ప్రైవేట్ లైఫ్ గురించి గంటల గంటలు చర్చలు పెట్టిన మెరుగైన సమాజంలో బ్రతుకుతున్న మనకు ఆ ఆతృత మీడియా ప్రపంచానికి.. ఇంకా నిజం చెప్పాలంటే ఈ విశ్వానికి అత్యవసరమైన అప్డేట్ ని అందించింది.. అన్ని చానల్స్ కట్టకట్టుకుని మరి ఎక్స్క్లూజివ్ గా నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ లకు పెళ్లి జరుగుతున్న వీడియోను వాటర్ మార్కు లోగో వేసేసి మరి ప్రజలకు అందించేసాయి.. ‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు..’ అన్న పొయిటిక్ క్యాప్షన్ తో మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్ర నరేష్ అంటూ రెండు రోజుల క్రితం డాక్టర్ నరేష్ పెళ్లి వీడియోను ఒక సినిమా విడుదలకు వదిలే గ్లిప్స్ లా ఎడిట్ చేసి ట్వీట్ చేశారు. ఆ వీడియో చివరిలో లైఫ్ టైం ఆఫ్ పీస్ అండ్ జాయ్ అన్న క్యాప్షన్ జతచేసి అందరిలో ముఖ్యంగా మీడియాలో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే నరేష్ దీన్ని విడుదల చేసినట్టు తెలుస్తుంది. రమ్య రఘుపతితో ఇంకా న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోకుండానే పెళ్లి చేసుకుని ఇలా బహిరంగ వీడియో విడుదల చేస్తారా అన్న కనీస ఆలోచన ఏ కోశాన లేకుండా మీడియా అదే వీడియోని పట్టుకొని పెళ్లి పీటలెక్కిన నరేష్ పవిత్ర, ఒక్కటైన కొత్తజంట, ఇలా అందమైన కొత్త జంట ఇలా అందమైన క్యాప్షన్స్ తో చానల్స్ లో హడావిడి మొదలుపెట్టారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో జరుగుతున్న మూడు ముక్కలాట అంత ఈజీగా కొలిక్కి వస్తుందా..? అన్నా కనీస జ్ఞానాన్ని కూడా వదిలేసి ఎక్స్క్లూజివ్ గా వేసేసి యూ ట్యూబ్ చానల్స్ కి మేమేం తీసిపోమన్నట్టు బిహేవ్ చేసింది. కొంతమంది సన్నిహితుల మధ్య మైసూర్ లో ఈ పెళ్లి జరిగిందని కథనాలు వండి వార్చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే నరేష్ విడుదల చేసిన ఆ పెళ్లి వీడియో ఓ సినిమాకు సంబంధించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి ఇటీవల అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలకు దర్శకుడుగా మారిన ఓ భారీ నిర్మాత తన స్వీయ దర్శకత్వంలో ఈ వెటరన్ ప్రేమికుల బయోపిక్ ను కామెడీ కోటింగ్ తో తెరకెక్కిస్తున్న చిత్రంలోని దృశ్యాలే ఈ పెళ్లి దృశ్యాలని ఫిలింనగర్ కబురు. ఆ సినిమా ప్రమోషన్ కోసమే నిజమనేటట్లుగా ఈ దృశ్యాలను పర్ఫెక్ట్ ఎడిటింగ్ లో ఫుల్ HDక్వాలిటీతో రిలీజ్ చేశారని తెలుస్తోంది. అశ్వద్ధామ హతః కుంజరః అన్నట్టు పెళ్లి మేటర్ తో లీగల్ ఇష్యూస్ వస్తే తూచ్ అది సినిమా షూటింగ్ అని బొంకేయవచ్చు లేకపోతే హ్యాపీగా కాలం గడిపేయొచ్చు పబ్లిసిటీకి… పబ్లిసిటీ… రియాలిటీకి.. రియాల్టీ.. స్వామి కార్యం.. స్వకార్యం.. వారెవ్వా ఒకే దెబ్బకి రెండు గాన్.. ఏం ఐడియా సామి.. కొసమెరుపు ఏంటంటే ఈ పెళ్లి పై కన్నడ మీడియా కూడా సేమ్ టూ సేమ్ స్పందించినా పెళ్లి గురించి చివరిలో ప్రస్తావిస్తూ రీల్ స్టోరీ నా..? రియల్ స్టోరీ నా చూడాలి అని ముక్తాయించడం కొంత బెటర్.