సమాజాన్ని జాగృతం చేసే కథలు, చక్కటి కుటుంబ ఇతివృత్తంతో యాభైకి పైగా సినిమాలను తీసిన ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన సమర్పణలో ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి తీస్తున్న చిత్రమిది. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వం వహించనున్నారు.
ఆగష్టు 9న అన్నపూర్ణా స్టూడియోలో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంటుందని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య వెల్లడించగా, దర్శకుడిగా ఎప్పటికీ గుర్తుంచుకునే అద్భుత చిత్రాలను అందించిన నాన్న సమర్పణలో ఈ చిత్రం ద్వారా నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తుండటం ఆనందంగా ఉందని ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తెలిపారు. ఇతర విషయాలను చిత్రం ప్రారంభం రోజున వివరిస్తామని ఆయన చెప్పారు. దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, ఓ వైవిధ్య భరిత , ఫామిలీ ఎంటర్ టైనర్ గా ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన చిత్రంగా దీనిని మలచనున్నామని చెప్పారు. ఈ చిత్రంలో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు తదితరులు నటిస్తుండగా శరవణన్ మూల కథ కి ముత్యాల సుబ్బయ్య, మరుదూరి రాజా లు కథా విస్తరణ చేయగా మాటలు నివాస్ ,పాటలు భువనచంద్ర, సమకూర్చుతుండగా కోటి సంగీతాన్ని అందిస్తున్నారు.