“మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన పీరియడ్ డ్రామా చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. 1980-90 ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ”లక్కీ భాస్కర్” చిత్రంలో చూడబోతున్నాం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్‌లతో పునర్నిర్మించారు. అలాగే ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే భారీ బ్యాంక్ సెట్‌ను కూడా రూపొందించారు. నాణ్యమైన కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, “లక్కీ భాస్కర్” విషయంలో కూడా వెనకడుగు వేయకుండా అత్యంత భారీ స్థాయిలో చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ క్రమంలో భారీ సెట్లను నిర్మించింది. ఈ సినిమా పట్ల నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. “లక్కీ భాస్కర్” ప్రయాణం అందరినీ కట్టి పడేస్తుందని, ప్రతి ఒక్కరూ భాస్కర్ యొక్క అసాధారణ ప్రయాణంలో లీనమై పోతారని తెలిపారు. ప్రముఖ కళా దర్శకుడు బంగ్లాన్ విస్తృతంగా పరిశోధించి, అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతి సెట్ లో సహజత్వం ఉట్టిపడేలా చేసి, 80ల నాటి ముంబై నగరాన్ని అందంగా సృష్టించారు. అలాగే, దర్శకుడు వెంకీ అట్లూరి ఆలోచనకు తగ్గట్టుగా ప్రముఖ ఛాయగ్రాహకుడు నిమిష్ రవి లక్కీ భాస్కర్ ప్రయాణాన్ని ఆకర్షణీయంగా కెమెరాలో బంధించారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, “శ్రీమతి గారు” గీతం విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేశాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
previous post
next post