కర్ణాటక ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేనప్పటికి బిజెపి గత ఎన్నికల్లో సాధించిన 36% ఓట్ల శాతాన్నే ప్రస్తుత ఎన్నికల్లో కూడా సాధించినదని, బిజెపి ప్రజాదరణలో ఏమాత్రం మార్పు లేదని కరడుగట్టిన ఆ పార్టీ నాయకులు సమర్ధించుకుంటున్నప్పటికి.. ఇప్పటికే ఉత్తరాది పార్టీ అని విపక్ష నాయకులు, ప్రజాసంఘాలు పిలుస్తున్న భారతీయ జనతా పార్టీకి దక్షిణాది ద్వారాలు మూసేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 1990 తరువాత 135ప్లస్ సీట్లు మళ్ళీ ఒక పార్టీ సాధించడం వెనుక కాంగ్రెస్ పార్టీ పై ఉన్న ఇష్టం కన్నా ఇప్పటి వరకు అధికారపార్టీ వల్ల ప్రజలు పడ్డ కష్టమే ఈ రిజల్ట్ కి కారణమంటున్నారు. స్పీకర్ తో సహా పదమూడు మంది మంత్రులను ఓడించిన కర్ణాటక ప్రజలు 31 స్థానాల్లో బీజేపీ కి డిపాజిట్లు కూడా గల్లంతు చేశారు. నిజానికి కన్నడ నాట సత్తాచాటి మిగిలిన సౌత్ రాష్ట్రాలకు విస్తరించాలన్న జాతీయ పార్టీ అడుగులను అడ్డుకున్న కన్నడ ప్రజలను భాజాపా వ్యతిరేక పక్షాలు పొగడ్తలతో ముంచేస్తున్నాయి. ఇక్కడినుంచే మార్పు కు అంకురార్పణ జరిగిందని ఇదే ఊపు దేశమంతా కొనసాగుతుందని ఢంకా భజాయించి చెప్తున్నారు. డజను ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ముందస్తుగా చెప్పినా అపర చాణక్యుడు రంగంలోకి దిగాడని ఫైనల్ ఫలితం వేరేగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చిన కమలాభిమానులకు మొదటి రౌండే చావుదెబ్బ కొట్టేసింది.. అయిన పూర్తి రిజల్ట్ వచ్చేవరకు మ్యాజిక్ ఫిగర్ (113) ఈజీ గా దక్కించుకున్నా కూడా కాంగ్రెస్ భయం భయంగానే ఉందంటే బీజేపీ పోల్ మేనేజ్మెంట్ ని అర్ధం చేసుకోవచ్చన్నది విశ్లేషకుల మాట. భజరంగ్ దళ్ తో తలగోరుక్కున్నప్పటికి కాంగ్రెసు విజయాన్ని ఆపలేదంటే నలభై శాతం కమీషన్ సర్కార్ పై ప్రజలకు ఉన్న ద్వేషాన్ని అర్ధం చేసుకోవచ్చంటున్నారు. అగ్రనేతలు, సినీనటులు కాళ్లకు బలపం కట్టుకు తిరిగినా.. సాక్షాత్తు ప్రధాని ప్రచారం కూడా ఇక్కడ అస్సలు పనిచేయలేదు.. సౌత్ కి కర్ణాటక గేట్ వే గా భావించిన బీజేపీ కి అక్కడినుంచే గేట్లు మూసేసారు. తెలుగు వాళ్ళు ఎక్కువ వుండే బెంగళూరు సిటీ లో ఉన్న 18 సీట్లకు గాను భాజపా కు కేవలం నాలుగంటే నాలుగు దక్కాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కసికూడా స్పష్టం గానే వ్యక్తం అయిందని చాలామంది చెప్తున్నారు.. జెడిఎస్ కు తగ్గిన ఓట్ల శాతం కాంగ్రెస్ కు కలవడం వల్ల మాత్రమే కర్ణాటకలో కాంగ్రెస్ ఈ ఫలితాలు సాధించగలిగిందని బిజెపి ఓటు బ్యాంకు పూర్తిగా ఎప్పటిలాగే స్థిరంగా నిలిచి ఉందని చెప్తున్నప్పటికి గతానికి ఇప్పటికి నలభై సీట్లను బిజెపి కోల్పోవడం పెద్ద దెబ్బె.. నెక్స్ట్ తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న ఆ పార్టీకి ఇది తీవ్ర నిరాశ తెచ్చే మాటే అని ఆ పార్టీ కి చెందిన వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించడం పరిస్థితి కి అద్దం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంద్రప్రదేశ్ మాత్రమే బీజేపీకి ఆశాదీపం అని జనసేన, టీడీపీ తో కలసి వెళ్తేనే సౌత్ లో కనీస మర్యాద దక్కుతుందన్నది కొంతమంది మాట..