పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్లాసిక్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త కొద్ది రోజులు వినిపిస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు.
దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమాను నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవంలో హీరో ప్రభాస్‌తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాతలు హాజరయ్యారు.
కాగా ఈ సినిమాలో సోషల్ మీడియా స్టార్ అండ్ డ్యాన్సర్ ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఆమె కూడా ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యింది. యుద్ధం, ప్రేమ, న్యాయం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి, సీనియర్ నటి జయప్రద కూడా నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘సీతారామం’ చిత్రానికి సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.