వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. దుల్కర్ సినిమాలను ఖచ్చితంగా థియేటర్లలో చూసి అనుభూతి చెందాలనే ప్రేక్షకుల నమ్మకాన్ని ఆయన పొందగలిగారు. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్, తన తదుపరి చిత్రం ‘లక్కీ భాస్కర్’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి మరియు ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపారు.
“సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం”గా రూపొందిన
‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో జరిగిన వేడుక లో విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. హాస్యం తో పాటు భావోద్వేగాలు , కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉంటాయి, సంగీతం బాగుంటుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నానన్నారు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో సుమతి పాత్ర నాకు బాగా ఇష్టమైన పాత్ర. ఈ ‘లక్కీ భాస్కర్’ అనేది నా మనసుకి బాగా దగ్గరైన చిత్రం. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ‘లక్కీ భాస్కర్’ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.