తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయి సభ్యులకు కార్డులు అందించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద దాసరి హెల్త్ కార్డుగా సభ్యులకు అతిథుల చేతుల మీదుగా అందజేసిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో నేను హీరోగా ఎదగకముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు, భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ మీ కలను సాకారం చేసుకోవడంలో ముందుకు సాగుతుంటారు. ఈ అసోసియేషన్ సభ్యులు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ఈ కమిటీలో ఒక ఎనర్జీ కనిపించింది. తమ సభ్యులకు ఏదో మంచి చేయాలనే తపన కనిపించింది. మధ్యాహ్నం భోజనం పెట్టడం అలాగే ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. ఈ అసోసియేషన్ కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ – మా డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీగా మేము ఎన్నికయ్యాక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించాం. మా సంఘంలో సభ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే గతంలో 25 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత అది లక్ష రూపాయలకు పెంచారు. అయితే చాలా మంది సభ్యులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని అడిగేవారు. మేము ఈసారి ఎలక్షన్స్ లో అవసరమైన సభ్యులకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అది కూడా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండా బయట నుంచి ఫండ్స్ సేకరించి అందిస్తామని హామీ ఇచ్చాం. హామీ ఇచ్చినట్లే ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఉచిత హెల్త్ కార్డ్స్ అందిస్తుండటం సంతోషంగా ఉంది. దీనంతటికీ కర్త, కర్మ, క్రియ మా సాయి రాజేశ్. సంఘంలోని 720 మంది అవసరమైన వారు ఈ హెల్త్ కార్డులకు అప్లై చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 1920 మందికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు.
దర్శకుల సంఘం ఉపాధ్యక్షులు సాయిరాజేశ్ మాట్లాడుతూ – అసోసియేషన్ సభ్యులు హెల్త్ కార్డ్ లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే మా కమిటీలో మొదటి ప్రాధాన్యత కింద ఆ అంశాన్ని చేర్చాం. హెల్త్ కార్డుల విషయం చెప్పగానే చిత్ర పరిశ్రమలోని ఎంతమంది స్పందించి ఆర్థిక సాయం చేశారు. ప్రభాస్ గారు 35 లక్షలు ఇచ్చారు. నా ఫ్రెండ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ 10 లక్షలు, బన్నీ వాస్ గారు, యూవీ వంశీ గారు ఇలా చాలా మంది ఆర్థిక సాయం అందించారు. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయడం కోసమే కొంత టైమ్ పట్టింది. హీరో విజయ్ దేవరకొండ మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఆయన తన ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి హెల్ప్ చేశారు. మీలో ఎవరికీ ఈ హెల్త్ కార్డ్ అవసరం రావొద్దని కోరుకుంటున్నామన్నారు
ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది.