Vaisaakhi – Pakka Infotainment

నేషనల్ అవార్డు కోసం కలలు కంటే…..

ఆశయం అంబరమైతే సాధించేది సగమైనా ఉంటుంది.. అన్నది ఓ స్ఫూర్తిదాయకమైన మాట.. కానీ అతని సాహిత్యం అంబరాన్ని చుంభించాలని ఆశపడితే.. అక్షరం మాత్రం విశ్వానికి గురి పెట్టింది.. ఆ పదం జనపదమై హృదయాలను తాకాలనుకుంటే.. ‘నాటు’ కొట్టుడు కొట్టి ఆస్కార్ నే ఆభరణంగా చేసుకుంది.. అలసిపోని ఆ అక్షరం తెలుగోడిని తలెత్తలా చేయాలనుకుంటే.. మీసం మేలేసేలా విశ్వవేదికపై సత్తా చాటింది.. ఎక్కడో చల్లగరికె నుండి మొదలైన ఆ ప్రస్థానం భాగ్యనగరంలో సాహిత్య చిత్రికను పట్టి డాల్బీ ధియేటర్ లో మెరిసి మురిసింది.. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని చెప్తూ నే మౌనంగానే ఎదగమన ప్రబోధించిన ఆ మంచుకొండల్లోని చంద్రమే.. ఈరోజు పడమట ఉదయించి ఆస్కార్ తో మన వేకువయింది. గాయకుడు అవుతామని హైదరాబాద్ వచ్చిన సుభాష్ చంద్రబోస్ గేయరచయిత గా 19 నెలల పాటు ‘నాటు.. నాటు’ పాట కోసం పడిన ప్రసవ కష్టానికి ఆస్కార్ పురస్కారం అందుకోవడంతో తెలుగు నేల మళ్లీ పల్లవించింది.. ‘పచ్చిమిరపలాగా పిచ్చనాటు..’ ‘గడ్డపారలాగ చెడ్డ నాటు..’ అంటూ అచ్చ తెలంగాణ పల్లె పదాల రుచిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన గురి మొదటి నుంచి జాతీయ అవార్డు పై ఉంటే దేవుడు అంతకు మించిన ప్రపంచ అవార్డుతో సత్కరించటం ఓ వ్యక్తి చేసిన ఐదు వేల పాటల సాహితీ సేద్యానికి మచ్చుతునక.. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే ఉత్తమ గేయ రచయితలుగా జాతీయ అవార్డు అందుకున్నారు శ్రీరంగం శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు( 1974) చిత్రానికి గాను ‘తెలుగువీర లేవరా’ పాటకు, వేటూరి సుందర మూర్తి మాతృదేవోభవ (1993)చిత్రానికి గాను ‘రాలిపోయే పువ్వా నీకు’ అన్న పాటకు, అలాగే సుద్దాల అశోక తేజ టాగూర్(2003) లోని ‘నేను సైతం’ అన్న పాటకు జాతీయ అవార్డులను అందుకున్నారు అయితే ఈ పాటలోని మకుటం మాత్రం శ్రీశ్రీ రాసిన ఇచ్చిన మహాప్రస్థానం లోనిదే వాడుకోవడం గమనార్హం. ఇక ఆ సంగతలా ఉంచితే ఎప్పటికైనా జాతీయ అవార్డు కొట్టాలన్న కోరిక బలంగా ఉన్న చంద్రబోస్ కి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వచ్చిన ఝుమ్మంది నాదం (2010) చిత్రం ఓ అవకాశాన్ని కల్పించింది. ఇందులోని ‘దేశమంటే మతం కాదు గతం కాదు’ అన్న గీతం కోసం జాతీయ అవార్డు ఎంట్రీ పంపించారు. కచ్చితంగా దానికి అవార్డు వస్తుందని అంతా భావించారు అందరి ధీమాకు అనుకూలంగానే గేయ రచయితగా చంద్రబోస్ కూడా ఆ పాటపై పెద్ద ఆశనే నింపుకున్నారు చివరాఖరికి ఆ పాట కొన్ని కారణాలతో తృటిలో అవార్డు అందుకునే ఛాన్స్ ను మిస్ చేసుకుంది. అయితేనే అదే చిత్రానికి సంగీతం అందించిన కీరవాణితో కలిసి విశ్వవేదికను పంచుకునే గడియను ఆర్ఆర్ఆర్ తీసుకొచ్చింది. ప్రపంచంలో మ్యూజిక్ అవార్డుకు పెద్దన్నయ్యగా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ అవార్డును చేజిక్కించుకొని ఆస్కార్ అవార్డును సగర్వంగా స్పృశించే అవకాశాన్ని ఇచ్చింది జాతీయ అవార్డు కోసం తహతహలాడితే ఆస్కార్ అవార్డు రావడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రపంచమే మెచ్చిన పాటకు బోనస్ గా జాతీయ అవార్డు కూడా నడిచిరావడం ఖాయం.. ‘నాటు నాటు’ పాట కోసం దాదాపు 19 నెలలు ఇష్టంగా కష్టపడిన చంద్రబోస్ చరితార్థుడిగా చరిత్ర పటంలో నిలిచిపోతారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More