తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘తెలుగోడు’ సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేశారు ఈ సినిమా సామజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో కథ, కథనం, మాటలతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రసీమలో ఎటువంటి నేపథ్యం గానీ, అనుభవం గానీ లేని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ వెంకీ మేడసాని…
తొలి ప్రయత్నంలో తెలుగు ప్రజానీకంపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు బయోపిక్ తీసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ”చంద్రబాబు గారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీద సినిమా తీశా” అని చెప్పారు. అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం మీద తాను సినిమా తీశానని, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించారు? అనేది ‘తెలుగోడు’ కాన్సెప్ట్ అని డాక్టర్ వెంకీ మేడసాని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా. ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని నేను అనుకున్నా. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిశా. కొందరు పెద్దలనూ కలిశా. రాజకీయ నాయకుడి సినిమా సినిమా తీస్తే విజయం సాధించదని వారించారు. పాయింట్ నచ్చి సినిమా తీశా. చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశాం. కంటెంట్ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్ రిలీజ్ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చింది” అని చెప్పారు.