అత్యాధునిక టెక్నాలజీతో 189 కిమీ ఔటర్
అమరావతి రాజధానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిమీ పొడవైన ఓఆర్‌ఆర్‌ను తానే కేంద్రం చేపట్టేందుకు ముందుకొచ్చింది. పెరిగిన ట్రాఫిక్, నూతన వాహనాల తీరును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో ఔటర్ నిర్మాణం చేద్దామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సీఎం చంద్రబాబుకు స్పష్టమైన హామీఇచ్చారు. ఖర్చు ఎంతైనా అమరావతికి అద్భుతమైన రహదారిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఔటర్ నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ ప్లాన్‌ను సిద్ధం చేశారు. రూ.18 వేల కోట్లతో దీన్ని నిర్మించాలని 2017-18లోనే ప్రతిపాదించగా కేంద్రం అప్పట్లోనే అంగీకరించింది. అయితే జగన్ వచ్చాక ఈ ప్రాజెక్టును మూలనపడేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఔటర్ మళ్లీ పట్టాలెక్కనుంది. చంద్రబాబు, రోడ్లు-భవనాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కె. రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు గురువారం గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన రహదారులపై ఆయనకు ప్రతిపాదనలు సమర్పించారు. అమరావతి ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్డుతోపాటు, విజయవాడలోని కీలక ప్రాంతాలను కలిసే తూర్పు బైపాస్ చేపట్టాలన్న చంద్రబాబు విన్నపానికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ‘ప్రజలకు, మౌలిక రంగం మరింత బలోపేతమయ్యేందుకు అవసరమైన సహకారమందిస్తాం. ఆ 3ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)లు రూపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
జాతీయ రహదారులుగా గుర్తించండి..
రాష్ట్రంలో 7 వేల కిమీపైనే జాతీయ రహదారులున్నాయి. ప్రస్తుతం స్టేట్ హైవేలుగాఉన్న 3,200 కిమీ రోడ్లను కూడా జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని గడ్కరీకి చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇంకోవైపు జాతీయ, రాష్ట్ర రహ దారులను ఆధునిక టెక్నాలజీతో నిర్మిద్దామని గడ్కరీ ప్రతిపాదించారు. రోడ్లపై ఐదేళ్లకోసారి నిర్వహణ పేరిట కోట్లు ఖర్చుపెట్టడం, వర్షాలకు అవి దెబ్బతినడం జరుగుతోందని, ఇకపై సిమెంట్ (సీసీ) రోడ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో కూడా కొత్తగా చేపట్టే పెద్ద ప్రాజెక్టులు, జాతీయ రహదారులను అవసరాన్ని బట్టి సీసీ టెక్నాలజీతో నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఆధునిక టెక్నాలజీతో రహదారుల నిర్మాణంపై టాటా కన్సల్టెన్సీతో అధ్యయనం చేయిస్తున్నట్లు ఆయన చంద్రబాబుకు తెలిపారు. నివేదిక త్వరలోనే వస్తుందని, 20 రోజుల తర్వాత మరోసారి సమగ్ర చర్చ చేద్దామ అన్నారు. రాష్ట్రం నుంచి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, నిపుణులైన ఇంజనీర్లు వస్తే అన్నింటిపై చర్చిద్దామన్నారు.