నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని – నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టాయి. ఇప్పటికే అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ పై ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో సీనియర్ హీరో అయి ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగినది కాదని అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య కూడా స్పందించాడు. “నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..” అవుతుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. మాటల సందర్భంగా బాలకృష్ణ ప్రాస కోసమే అలా మాట్లాడి ఉంటారని అక్కినేని కుటుంబాన్ని బాలకృష్ణ కు కించపరిచే ఉద్దేశం లేదని, అక్కినేని నాగేశ్వరావు అంటే ఆయనకు ఎంతో అభిమానం అని నందమూరి అభిమానులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలకృష్ణ కావాలని ఏ హీరో ని కూడా ఉద్దేశించి అలా మాట్లాడడని పేర్కొంటున్నారు. మరోపక్క అక్కినేని అభిమానులైతే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందేనని అంటున్నారు. నోటికి వచ్చినట్లు ఏది పడితే అలా మాట్లాడటం సీనియర్ హీరోకు సరైంది కాదని, ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..! వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్లో సినిమా షూటింగ్లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలిపే సందర్భంలో బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైమ్ పాస్. ఎప్పుడూ కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం” అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఈ వ్యాఖ్యలే ఆ తర్వాత వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండి పడుతుండగా నందమూరి అభిమానులు బాలకృష్ణను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బాలయ్య కావాలని అక్కినేని కుటుంబం కోసం చేసిన వ్యాఖ్యలు కాదని, ప్రాస సందర్భంలో అలా మాట్లాడి ఉంటారు తప్ప మరో ఉద్దేశ్యం ఆయనకు లేదని చెబుతున్నారు. ఏదైతేనేం ఇప్పుడు ఈ వ్యాఖ్యలే అభిమానుల మధ్య వివాదానికి కారణమయ్యాయి.