పోలింగ్ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి పగలగొట్టడాన్ని ఈసీ తీవ్ర అంశంగా పరిగణించింది. పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లారు. ఈవీఎంను నేలకేసికొట్టి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఈ ఘటనలో ఇప్పటి వరకూ పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకుకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై టీడీపీ నేత లోకేశ్ పెట్టిన ట్వీట్‌ను ఈసీ ప్రస్తావించింది.పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు, పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో ఈనెల 20నే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు పిన్నెల్లి సోదరుల కోసం గాలింపు బృందాలు హైదరాబాద్ బయలుదేరి వెళ్లాయి.