ట్రైన్ 18గా కొంతకాలం వ్యవహరింప బడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బాగా పాపులర్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తమకు కావాలని అన్ని రాష్ట్రాల నుంచి రైల్వేశాఖ కు అధిక సంఖ్యలో డిమాండ్స్ వస్తున్నాయి. భారతీయ రైల్వే ప్రస్తుతం 13 రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్ళని నడుపుతుండగా ఈ ఏడాది మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రాలనుండి ఎన్నో ప్రతిపాదనలు అందుకుంటున్న ఈ ట్రైన్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనా.? ఈ రైళ్లు కేంద్ర ప్రభుత్వ గౌరవ ప్రతీకగా మారాయా..? అసలు వందే భారత్ నేపథ్యం ఏంటీ..? వందే భారత్ రైళ్లుగా పిలవబడుతున్న ఈ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(MEMU) ట్రైన్ 2019 జనవరి లో పేరు మార్చుకుని అదే ఏడాది ఫిబ్రవరి15 నుంచి పట్టాలపై పరుగులు పెట్టడం ప్రారంభించింది. 1990ల నుంచే ఈ సాంకేతికత ఉన్నప్పటికీ ఈ రైళ్ల ద్వారా అది మరింత విస్తృతి చెందింది. MEMU టెక్నాలజీ తో రూపుదిద్దుకున్న ఈ రైలు టెస్టింగ్ సమయంలోనే గరిష్టంగా గంటకు సుమారుగా 180 కిమీ (110 మైళ్లు) వేగాన్ని అందుకున్నప్పటికి రైల్వే ట్రాక్ ల నిర్వహణ సామర్థ్యం, ట్రాఫిక్ పరిమితులు, వేగ నియంత్రణ వంటి వివిధ కారణాలతో ఢిల్లీ-భోపాల్ మార్గంలో గంటకు 160 కిమీ (99 మైళ్లు) ఇతర మార్గాల్లో 110–130 (68-81 మైళ్లు) కిలోమీటర్ల కు పరిమితం చేసారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూపొందించిన ఈ రైళ్ల డిజైన్ స్పెసిఫికేషన్‌లన్నీ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(RDSO) ఆమోదం తో ప్రమాణికరించారు.16 కోచ్‌లతో కూడిన వందే భారత్ రైలు తయారీకి ధర సుమారు 115 కోట్లు (14 మిలియన్ అమెరికన్ డాలర్లు) వ్యయం కాగా ఏడు ఎనిమిది కోచ్లతో వుండే మినీ వందే భారత్ రైలు నిర్మాణ వ్యయం దాదాపుగా70 కోట్లు (8.8 మిలియన్అమెరికన్ డాలర్లు) అవుతుందని ఇండియన్ రైల్వే తెలియజేస్తోంది. జూన్ 2015లోనే ఈ తరహా రైళ్ల రూపకల్పన కోసం భారతీయ రైల్వేలు బిడ్ లను ఆహ్వానించినా అవసరమైన ప్రమాణాలను సాంకేతికత ను ఏ బిడ్ అందుకోలేకపోవడంతో మేక్ ఇన్ ఇండియా లో భాగంగా మనదేశంలోనే ఇండిపెండెంట్ గా రైళ్లను తయారు చేయాలన్న నిర్ణయంతో చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో “ట్రైన్-2018” తయారీకి శ్రీకారం చుట్టారు. నాలుగు సంవత్సరాల నిర్మాణాంతరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చుకుని రైళ్లు ట్రాక్ ఎక్కాయి. కాన్పూర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా వారణాసిని రాజధాని నగరానికి కలుపుతూ, న్యూ ఢిల్లీ నుండి వారణాసి 8 గంటల్లో ఈ తొలిరైలు కూత మొదలుపెట్టింది మలి ప్రయత్నం గా అదే సంవత్సరం న్యూఢిల్లీ-కత్రా ట్రైన్ ను ప్రారంభించారు ప్రస్తుతం ఈ రెండు రైళ్లతో పాటు గాంధీనగర్- ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ- అంబ్ అందౌర, చెన్నై- మైసూరు, బిలాస్‌పూర్-నాగ్‌పూర్, హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్, సికింద్రాబాద్-విశాఖపట్నం, ముంబై సెంట్రల్-సోలాపూర్, ముంబై సెంట్రల్-సాయినగర్ షిరిడీ, రాణీ కమలాపతి హబీబ్‌గంజ్-హజ్రత్ నిజాముద్దీన్, సికింద్రాబాద్-తిరుపతి, చెన్నై సెంట్రల్-కొయంబత్తూర్ రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.