నాటి స్మారక కట్టడాలు గత చరిత్రకు ఆనవాళ్లు… అది ఏ కాలంలో నిర్మించిందయినప్పటికీ నాటి కాలమాన పరిస్థితులను, సంస్కృతి సాంప్రదాయాలను, ఆనాటి ప్రజల జీవ విధానాన్ని, రాజరిక వ్యవస్థను, సామాజిక పరిస్థితులను తెలియజేస్తాయి. భారతదేశంలో అటువంటి పురాతన కట్టడాలు లెక్క లేనని ఉన్నాయి. ప్రతి నిర్మాణానికి ఒక చరిత్ర అంటూ ఉంది. ఆ చరిత్ర పుటలలో మనం గొప్పగా చెప్పుకునే ఉదయగిరికొండ, ఉదయగిరి దుర్గం కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాజుల పాలన భోగభాగ్యములతో ఎప్పుడూ తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతా పోయింది,అప్పటి వైభవానికి సాక్ష్యాలు గా ఉదయగిరికొండ, ఉదయగిరి దుర్గం మాత్రమే నేడు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. నెల్లూరు పట్టణానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోట వీకెండ్ లో పర్యాటకులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉన్న ఉదయగిరి కోటలో నిధి నిక్షేపాలున్నాయని కొన్ని ముఠాలు తవ్వకాలు జరిపి చరిత్రకు అద్దం పట్టె చారిత్రక కట్టడాలు కూల్చేస్తున్నారు. అధికారులు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ కోటను కాపాడే ప్రయత్నాలు చేస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారు. శిధిలమైపోయిన కొన్ని కట్టడాలను మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మించి పర్యాటకులు వీక్షించేందుకు అనువుగా చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశాల నుంచి టూరిస్టులు ఈ ప్రాంతంలో చూసేందుకు వస్తున్నారు. ఉదయగిరి కొండ, ఉదయగిరి దుర్గానికి ఎంతో చరిత్ర ఉంది. పలువురు రాజుల ఆధీనంలో ఉంటూ వారి పాలనలో ప్రసిద్ధ ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. హిందు రాజుల నుంచి ముస్లిం రాజుల వరకు పల్లవుల నుంచి విజయనగర రాజుల వరకూ ఈ కోటను పరిపాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. ముస్లీం పాలకుల్లో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఈ కోటను పాలించాడు. అతను వాడిన ఖడ్గం ఇప్పటికీ ఈ కోటలో ఉందనే ప్రచారం జరుగుతుంది. ముస్లిం రాజుల తర్వాత ఈ కోట ఆంగ్లేయుల వశమైంది. ఆ సమయంలో డైకన్ దొర కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ కోటలోని రాజ్ మహల్ లో అద్దాలమేడతో పాటు ఇంకా అనేక భవనాలను నిర్మించాడని తెలుస్తుంది. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశల నుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు. విజయనగరం రాజుల పాలనలో ఇక్కడ స్వర్ణ యుగముగా చెబుతారు. జన రంజకమైన ప్రజాపాలనతో పాటు కళలకు, కవులకు పండితులకు ఇక్కడి రాజులు ప్రోత్సాహం మరింతగా ఉండేదని తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్యము స్థాపించినప్పటి నుంచీ 14వ శతాబ్దం మొదటిభాగం నుంచి ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటయింది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు ఉన్నాయి. ఉదయగిరి రాజ్యానికి ములికనాడు అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ చాలా ఉన్నాయి. సమిరకుమార విజయం రచించిన పుష్పగిరి తిమ్మన్న ఆత్మకూరు తాలూకావాడు అని తెలుస్తుంది. విక్రమార్క చరిత్రము వ్రాసిన వెన్నలకంటి సిద్ధనకు జక్కన కవి అని బిరుదు ఉండేది. ఈ సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యములో మత్రిగా ఉండేవాడు. ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడా పేరు తెచ్చుకుంది. అచ్యుతరాయ, రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యముకు రాజప్రతినిధిగా రామామాత్యుడు ఉన్నాడు. ఇతడు సర్వమేళకళానిధి అనే ప్రసిద్ధ సంగీత గ్రంధాన్ని రచించాడు. దాన్ని రామరాయలకు అంకితం చేసాడు. ఇతనికి “వాగ్గేయకార తోడరుమల్లు” అను బిరుదు ఉంది. అక్బరు కాలమున ఆర్థికమంత్రిగా పని చేసిన తోడరుమల్లు చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగా ఉండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్ల ఈబిరుదు ఇతనికి ఇచ్చినట్లు చేస్తుంది. ఉదయగిరి గ్రామానికి కొండాయపాలెం అని పేరుకూడ ఉంది. ఉదయగిరి కొండమీద ఒక ఆలయం ఉంది. దానికి వల్లభరాయ దేవాలయమని పేరు. వల్లభరాయడను మంత్రి దానిని నిర్మించటం వలన ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. దేవాలయము పక్కన చక్కని కోనేరు ఉంది. ఈ వల్లభరాయుడు శ్రీకృష్ణ దేవరాయల వారి ప్రతినిధి. ఇక ఒడిషా గజపతుల కాలంలో కూడా ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందిందనే చరిత్రకారులు చెబుతున్నారు. ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. గజపతుల పాలనలోనూ, ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించారు. మొత్తం పట్టణాన్ని, దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్ఠమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలలో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి. నేటికీ అప్పటి కొన్ని ఆడవాళ్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఉదయ గిరికొండ, ఉదయగిరి దుర్గం అనేవి గత చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. చాలావరకు అప్పటి చరిత్ర అందరికీ తెలిసినప్పటికీ కూడా కొందరు నేరుగా వెళ్లి వాటిని చూసేందుకే ఆసక్తిని కనబరుస్తున్నారు. వీటిని సందర్శించేందుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.