తమిళ్ ఫిల్మ్ మేకర్స్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి హెచ్చరించారు. ఫెఫ్సీ నిబంధనలు ఎవరు అతిక్రమించిన సరే అటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సమాఖ్య నిర్వాహకులు, తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు చైన్నెలో సమావేశమై తీసుకున్న కీలక నిర్ణయాలను సెల్వమణి వెల్లడించారు. 2022 మార్చిలో చేసుకున్న ఒప్పందం మేరకు తమిళ చిత్రాల షూటింగ్‌లలో తమిళ కళాకారులకే పని కల్పించాలని, తమిళ చిత్ర షూటింగ్ లను తమిళనాడులోనే నిర్వహించాలని సెల్వమణి చెప్పారు. షూటింగ్‌లో పనిచేసే దినసరి కార్మికులకు అదేరోజు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక సినిమాను నిర్మించడానికి ముందు నటీనటులు, సాంకేతికవర్గంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఫెఫ్సీకి లిఖిత పూర్వక లేఖ రాసి అందజేయాలన్నారు. అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయని చిత్ర నిర్మాత ఫెఫ్సీకి లిఖితపూర్వక లేఖను అందించిన తర్వాతే ఫెప్సీ కార్మికులు ఆ చిత్రాల్లో పనిచేస్తారన్నారు. తమిళ చిత్రాలను అనవసరంగా విదేశాల్లో షూటింగ్ నిర్వహించరాదని పేర్కొన్నారు. చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన బడ్జెట్ లో నిర్ణయించిన రోజుల్లో పూర్తిచేయలేకపోతే నిర్మాతల వర్గం అందుకు కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. చిత్ర కథను దర్శకుడే రాసుకుంటే ఆ తర్వాత ఆ కథ గురించి తలెత్తే సమస్యలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్మాతలను సమస్యల్లోకి లాగకూడదన్నారు. ఇతర రచయిత కథ అయితే దర్శకుడు అందుకు తగిన విధివిధానాలను రూపొందించాలన్నారు. నిబంధనలను అతిక్రమించి వ్యవహరించే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.