కేంద్ర లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటుపరం చేయడంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను కూడా కావాలని తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్ప చెబుతున్నారని విమర్శలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ మాత్రం బిజెపి తీరును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద కూటమిని కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా వ్యవహారచన చేస్తున్నారు. ఈ విషయంలో తమతో పాటు కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో తమ పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో అన్ని సీట్లలోనూ తమ అభ్యర్థులను నిలబడతామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కు న్యాయం చేస్తామని, ఎప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయమనివ్వమని అన్నారు. దేశం మొత్తం మీద ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్నింటిని ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, జాతీయం చేస్తామని ప్రకటించారు. ఏపీ నేతలు బీఆర్‌ఎస్ లో చేరికలు సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేరతామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ఏపీలో సిసలైన ప్రజా రాజకీయాలు రావాలని అన్నారు. ఎంత ఖర్చయినా విశాఖ ఉక్కును మళ్లీ పబ్లిక్ సెక్టార్‌లోకి తీసుకొస్తామన్నారు. మోదీ ప్రభుత్వానిది ప్రైవేటీకరణ విధానమైతే తమది జాతీయీకరణ విధానమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ అధికార పార్టీ నాయకులు మాత్రం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాటం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కనీసం కేసిఆర్ అయినా స్పందించి స్టీల్ ప్లాంట్ విషయంలో తన నిర్ణయాన్ని స్పష్టం చేశారని కొంత మంది అంటున్నారు.