విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధిపత్య పోరు మళ్లీ మొదలయింది. ఇప్పటికే ఇక్కడ కొందరు వర్గాలుగా విడిపోయి తమ ప్రాధాన్యతను పెంచుకుంటున్నారు. పార్టీ కార్పొరేటర్లు తలోదిక్కు వైపు వెళ్తున్నారు. ఎవరికి కూడా సరిగా పోసగడం లేదు. ఎవరి దారి వారే చూసుకుంటున్నారు. ఇందులో కొందరు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ ఉంటే, మరికొందరు గ్రూపులుగా ఏర్పడి తాము చెప్పినట్లుగా ఇక్కడ జరగాలని భావిస్తున్నారు. అవసరమైతే తిరుగుబాటుకు కూడా వెనకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొందరువాడిగా మాత్రమే చెలామణి అవుతున్నారు. మరి కొందరికి దూరంగా ఉంటున్నారు. స్థానిక నాయకత్వాన్ని సరిగా పట్టించుకోకపోవడం, తన వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం పై విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఉంటున్న వైసిపి కార్పొరేటర్లు అందరూ ఎమ్మెల్యే సీటు ఆశిస్తూ ఉండటం కూడా దీనికి కారణం అని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు బహిరంగంగానే వచ్చే ఎన్నికలలో తాము ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెబుతున్నారు. టికెట్ కోసం ఆశించడమే కాకుండా ప్రయత్నం చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. అయితే ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ మళ్లీ తనే పోటీలో ఉంటున్నట్లు తన వర్గానికి, కార్యకర్తలకు స్పష్టం చేశారు. పార్టీ తీరు, ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చక ఇప్పటికే స్థానిక 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు వైసీపీ పార్టీ వీడి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనలో చేరిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి దక్షిణ వైసీపీలో జరుగుతున్న వ్యవహారాన్ని వివరించారు. మరికొద్ది నెలల తర్వాత ఇప్పుడున్న కొందరు వైసీపీ కార్పొరేటర్లు పార్టీ వీడి వేరే పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు కందుల నాగరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు మరింతగా పుంజుకున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఇక్కడ మెజార్టీ సీట్లు ఈ రెండు పార్టీలు సాధించడం ఖాయమని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు, ఇతర నాయకులు ఎన్నికల ముందు టిడిపి లేదా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. అదే వైసీపీ పార్టీ నుంచి ఉండటం విశేషం. ఇక్కడున్న కార్పొరేటర్లు అందరు కూడా తమ టార్గెట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడమేనని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక స్థానిక వైసీపీ నాయకులు స్తబ్దుగా ఉన్నారు. మళ్లీ ఇక్కడ వైసిపికి పూర్వ వైభవం రావాలంటే నాయకుల మధ్య ఉన్న విభేదాలను పూర్తిగా పక్కన పెట్టాలి. మనస్పర్ధలకు చోటు ఇవ్వకూడదు. పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలి. అందర్నీ కలుపుకొని వెళ్లాలి. అప్పుడే ఇక్కడ పార్టీ మన గలుగుతుంది. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ చేస్తుంది. లేదంటే వచ్చే ఎన్నికల తర్వాత ఇక్కడ వైసిపి గల్లంతు కావడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు