ఎన్నికల హామీ నీ నెరవేరుస్తున్న బిజేపి
46 ఏళ్ల తర్వాత పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయ ఖజానా అయిన రత్నా భండార్‌ను జులై 14 న తెరిచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ముందుగా ఈ భండార్ పై ఏర్పాటైన కమిటీ ముందుగా సమావేశం కానుంది. ఇది తెరిచే సమయంలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా శ్రీ జగన్నాథ దేవాలయం మేనేజింగ్ కమిటీ వారి కార్యాచరణను ప్లాన్ చేయడానికి ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు..1978 లో నమోదు చేసిన రికార్డుల ప్రకారం, ఆలయ రత్న భండార్‌లో మొత్తం 454 బంగారు వస్తువులు ఉన్నాయి, వాటి నికర బరువు 12,838 భరీలు (128.38 కిలోలు) మరియు 293 వెండి వస్తువులు 22,153 భరీలు (221.53 కిలోలు). వున్నాయి.. ఆషాఢ మాసంలో జగన్నాథుని రథయాత్ర జరుగుతున్న సమయంలో రత్న భాండాగారం తెరవడం శుభ పరిణామమని అంటున్నారు.. అప్పట్లో కూడా పూర్తి వివరాలు నమోదు చెయ్యలేదని రికార్డు ల్లో వున్న నిధి కన్నా ఇంకా ఎక్కువ అభరణాలు వుంటాయని కొంతమంది స్థానికులు చెప్తున్నారు. అదే నిజమైతే అనంత పద్మనాభ స్వామి నిధి తో పూరి జగన్నాథుడు పోటీ పడే అవకాశం వుంది..
రత్న భండార్‌లో నిల్వ చేసిన ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తో చర్యలు ప్రాంభించింది. అందరి ఆమోదం తోనే రత్న భండార్‌ను తెరవనున్నట్టు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. తొలుత వున్న తాళాలతో రత్న భండార్ తెరవడానికి ప్రయత్నాలు చేస్తామని అన్‌లాక్ చేయడంలో అవి విఫలమైతే, మేజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టబడతాయని హరిచందన్ తెలియజేశారు. రత్న భండాగారం తెరవడం, అభరణాలు గది మరమ్మతు వంటి వివిధ అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
“ఆభరణాల ఇన్వెంటరైజేషన్‌లో పారదర్శకతను కొనసాగించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారాన్ని తీసుకున్నట్టు అలాగే పాత విలువైన లోహాల పరిశీలన సమయంలో ఆర్‌బీఐ ప్రతినిధులు ఆభరణాల స్వచ్ఛత, వెయిటేజీని నిర్ణయిస్తారు. భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం రాకుండా డిజిటల్‌గా డాక్యుమెంట్ చేయబడుతుందని ఆయన తెలిపారు.
1978లో ఆభరణాల గణన కు 72 రోజులు పట్టింది. సాంకేతికత అభివృద్ధి కారణంగా, ఇప్పుడు ఆ వ్యవధి చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. గది తెరిచే సమయం లో ఎవరెవరు హాజరు కావాలన్న అంశం పై జగన్నాథ ఆలయ ఉన్నత స్థాయి కమిటీ, మేనేజింగ్ కమిటీ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. ట్రెజరీ తెరిచే సమయంలో పాములు పట్టేవారు, వైద్యులు, విపత్తు నిర్వహణ సిబ్బంది బృందాలు సిద్ధంగా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి… నాలుగు దశాబ్దాలుగా మూతపడిన రత్న భండారంలో పాములు పెద్ద సంఖ్య లో వుండే అవకాశం వుందని భావిస్తున్నారు. ఆలయ ఆచారాల ప్రకారం ప్రారంభ సమయంలో ప్రతినిధులందరూ కూడా సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలని సూచించారు. ఇదిలా వుండగా ఇప్పుడు తెరవబోతున్న గది నుంచి మరో గది కి మార్గం వుందని అందులో వూహించని ఖజానా నిక్షిప్తమై వుందని స్థానికులు చెప్పడం కొసమెరుపు..