ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, పగలకు మనోవేదన చెందడంవల్లే రామోజీ రావు ఆరోగ్యం దెబ్బతిన్నదని ఏపీలో ఎన్నికల ఫలితాలు రాగానే అరాచకపాలన అంతమొందిన్న వార్తలను చూసుకున్న అనంతరమే ఆయన మనఃశాంతితో తుది శ్వాస విడిచారని ఈనాడు పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతోమందికి ఆయన ఆదర్శప్రాయులు, స్ఫూర్తిప్రదాత. రామోజీ ఫిలింసిటీని నిర్మించి, చిన్న సినిమాలు కూడా షూటింగ్ చేసుకునేందుకు ఎంతగానో సహకరించారు. నేను నిర్మాతగా తొలినాళ్ళలో బండ్ల గణేష్ హీరోగా తీసిన సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేయడానికి కారణం చిన్న సినిమాల పట్ల ఆయనకు ఉన్న ఆదరణ, పెద్ద మనస్సే. చిన్న సినిమాలు సైతం ఫిలింసిటీలో షూటింగ్ చేసుకోవచ్చని చాటి చెప్పారు. నేను ఫిలింఛాంబర్, ప్రొడ్యూvసర్స్ కౌన్సిల్ లో ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన సూచనలు, సలహాలను ఇచ్చి మార్గదర్శకులుగా నిలిచారు. కొత్త వాళ్ళతో అయినా సినిమాలు తీసి, ఎంత పెద్ద హిట్ చేయొచ్చో నిరూపించారు. 2008లో ఒకసారి ఫ్లైట్ లో చెన్నైకి వెళుతున్నప్పుడు అదే ఫ్లైట్ లో వారి పక్కన కలసి ప్రయాణించే అదృష్టం, అనుబంధం నాకు కలిగింది. ఆ సందర్భంగా వద్దు అని వారించి మరీ వారి లగేజీని వారే మోసుకుని వెళ్లడం ఆయన నిరాడంబరతకు ఒక నిదర్శనం. దర్శక, నిర్మాతలుగా దాసరి నారాయణరావు గారు, ఆయన సమకాలీకులు. కొత్త వాళ్ళను, చిన్న సినిమాలను పోటాపోటీగా తీసి, చిత్రసీమలో ఆరోగ్యకరమైన మంచి సినిమాల సృష్టికర్తలుగా నిలిచిపోయారు. నిజాయితీగా వార్తలను ఉన్నది ఉన్నట్లుగా ప్రెజంట్ చేశారు. ఉదయం ఐదు గంటలకే ప్రపంచం నలు చెరగులా పేపర్ ను అందిచడంతో పాటు ఈటీవీని సైతం ప్రజల చెంతకు చేర్చి, చైతన్యాన్ని నింపారు. పత్రికలలో వార్తలకు సంబంధించిన భాష ఎలా ఉండాలో తన ఈనాడులో రాసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రామోజీరావు గారు లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని నట్టి కుమార్ పేర్కొన్నారు.