ల్యాండ్ టైటిలింగ్ ఎక్ట్ ని మాజీ సీఎం ఎందుకు మంచిదంటున్నారు..? ప్రస్తుత సీఎం ఎందుకు రద్దు చేశారు..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా ఒకటి. అసలు ఏపీ ఓటర్లను అంతగా ప్రభావితం చేసి అధికార వైసీపీ ని ప్రతిపక్ష హోదా కూడా దక్క కుండా కేవలం పదకొండు సీట్లకే పరిమితం చెయ్యడం లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాత్ర చాలా ఎక్కువ అంటున్నారు. ఇంత ప్రభావం చూపించిన ఈ యాక్ట్ మంచిదే అని ప్రజలే తప్పుగా అర్ధం చేసుకున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి అనడంతో అసలింతకు ఈ ఎక్ట్ మంచిదా.. కాదా..? అన్న డౌట్ ప్రజల్లో ఎక్కువైంది.. తొందరపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎక్ట్ ని రద్దు చేశారా… ఆఅందరి లో ఇదే అనుమానం.. అసలు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎక్ట్ ఏంటి..?ఎందుకు మళ్ళీ రద్దు చేయబడింది..?

కొన్ని వందల ఏళ్ల నుంచి నుంచే భూ సమస్యలు, వివాదాలను సరిచేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి ఈరోజుకి కొలిక్కిరాలేదు. నిజానికి కొంత కాలం కిందట కేంద్ర ప్రభుత్వ సూచనలతో భారతదేశంలోనే మొదటిసారి ఆంధ్రాప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్ -2022ను తీసుకొచ్చింది.లక్ష్యం మంచిదే అయినా ఆ చట్టం అమలు చేసే విధానంలోని కొన్ని అంశాలు వివాదాస్పదమయ్యాయి. ఒకసారి రికార్డులో మీ పేరు చేరి, మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అది తిరుగులేని ఆయుధం అవుతుంది. ఇక ఎవరూ దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారెంటీగా నష్ట పరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారెంటీ అన్నారు.దీనికోసం ప్రస్తుతం ఉన్న వీఆర్వో, ఆర్ఐ, తహశీల్దార్, సివిల్ కోర్టులు, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్‌ఏ, సబ్ రిజిస్ట్రార్, సివిల్ కోర్టులు వంటి వాటిలో భారీ మార్పులు వస్తాయి. కొత్త చట్టం ప్రకారం వీళ్లందరి బదులు కొత్తగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వస్తారు. మీ భూమి సమస్య మీద ఇకపై సివిల్ కోర్టుల్లో దావాలు వేయడం కుదరదు. ఇక ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీరుస్తారు. ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి. వీళ్లద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్లాలి.టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే భూమి పత్రాలు, హక్కులు సరళంగా ఉంటాయి. లింకు డాక్యుమెంట్లు, కలిపిరాతలు, వారసత్వ తగాదాలు ఏమీ ఉండవు. మీరు ఒక బండి కొనుక్కుంటే మీ పేరిట ఎంత సరళంగా రిజిస్టర్ అయిపోతుందో, భూమి విషయంలో కూడా అంతే క్లియర్గా ఒకటే కాగితంపై మీ హక్కును రాస్తారు. చట్టం లక్ష్యం బావున్నా అమలు విషయం దగ్గరే కొంప ముంచేంత ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం భూ వివాదాలను కోర్టుల్లో పరిష్కరిస్తున్నారు. కానీ, కొత్త చట్టం ప్రకారం కోర్టులకు బదులు కొందరు అధికారులు తేలుస్తారు. ఈ అధికారులు కోర్టుల్లాగా స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తాయి సర్వ అధికారాలున్న టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అని చట్టం చెబుతోంది. సదరు వ్యక్తి ప్రభుత్వ ఇష్ట ప్రకారం నడుచుకుంటూ, ప్రభుత్వానికి ఇష్టంలేని వారి భూములను లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితి ఏంటన్నది మరొక ప్రశ్న.అప్పిలేట్ అధికారిగా మాత్రం జాయింట్ కలెక్టర్ స్థాయి వ్యక్తి ఉంటారు. వీళ్లను ఏపీ ల్యాండ్ అథారిటీ నియమిస్తుంది. ఛీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి చేతుల్లో ఆ ల్యాండ్ అథారిటీ ఉంటుంది. వీరంతా ఇప్పటి వరకూ రెవెన్యూ కింద ఉన్నవారే. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని అప్పిలేట్ అధికారి కూడా సమర్థిస్తే అప్పుడు నేరుగా హైకోర్టుకు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండదు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుంది. ఆ అధికారి తీసుకున్న నిర్ణయమే ఫైనల్. నిర్ణయం వెలువడే వరకు వివాదంలో ఉన్న భూమి అమ్మకం, కొనుగోలు జరగదు. విచారణ చేసే క్రమంలో అవతలి పక్షానికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధన ఈ చట్టంలో లేదు. . ఇతరులు ఫిర్యాదు చేస్తేనే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచారణ చేపట్టాలని లేదు. ఆ అధికారి సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు. ఒకసారి వివాదం అంటూ నమోదయ్యాక ఆ అధికారి చేతిలో భూ యజమానులు చిక్కుకుంటారు. సదరు అధికారి ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా కేసు పెట్టకుండా చట్టంలో రక్షణ కల్పించారు.తమకు తప్పుడు పత్రాలు ఇచ్చారన్న కారణాలతో భూమి విషయంలో పార్టీకి ఆరు నెలల వరకూ జైలు శిక్ష వేసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉంది. ప్రస్తుతం ఆంధ్రలో దాదాపు 550కి పైగా సివిల్ కోర్టులు ఉన్నాయి. వాటన్నిటిలో వివాదాలన్నీ ఇకపై టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, వారిపైన ఉండే జిల్లా స్థాయి ట్రిబ్యునళ్లు మాత్రమే పరిష్కరించాలి. అంటే వివాదం తేలడం చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.మీ భూమి సంబంధిత కేసు హై కోర్టు, సుప్రీం కోర్టులలో గెలిచిన 15 రోజుల్లోపు సదరు అధికారికి ఆ విషయాన్ని తెలియచేయాలి. లేదంటే సుప్రీం కోర్టు తీర్పు కూడా చెల్లకుండా పోతుంది.టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అధికారికంగా నిధులు, విరాళాలు సేకరించవచ్చు అని చట్టం చెబుతోంది. అసలు భూమి హక్కులు నిర్ణయించడం, సమస్యలు పరిష్కరించడం వంటి పనులు చేసే అధికారులకు నిధులు, విరాళాలు సేకరించాల్సిన అవసరం ఏంటి? అనేది ప్రశ్న. దీని మీద వివరణ రావాల్సి ఉంది.ఎవరైనా ఏదో తప్పుడు పత్రాలు సృష్టించి మీ భూమి తమదేనంటూ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర వివాదం పెట్టారనుకుందాం.

మీరు విదేశాల్లో ఉన్నారు. లేదా వేరే ఊరిలో ఉండి ఆ విషయం మీకు తెలియలేదు. రెండేళ్ల పాటూ ఆ పిటిషన్ మీద ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోతే వెంటనే మీ భూమి కాస్తా డిస్పూట్ పెట్టిన వారి చేతికి పోతుంది. అంటే మీ భూమి మీది కాకుండా పోతుంది.అలాగే భూమి యజమాని చనిపోతే వారి వారసులు ఎవరు అనేది గతంలో తహశీల్దార్లు తేల్చేవారు. దాన్నే ‘లీగల్ హేర్ సర్టిఫికేట్’ అంటున్నారు. తరువాత అలా ఇవ్వడం చెల్లదని కోర్టుకు వెళ్లి లీగల్ హేర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త చట్టంలో వారసులను నిర్ణయించే బాధ్యత అధికారులకు అప్పగిస్తున్నారు.కొత్త చట్ట ప్రకారం ప్రభుత్వం నియమించే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కే అన్ని అధికారాలు ఉంటాయి. వారు చెప్పింది జిల్లా జడ్జీతో సమానం. కానీ, ఆ అధికారికి న్యాయ అవగాహన లేకపోతే? న్యాయ పరిజ్ఞానం లేని వారిని నియమించకూడదు అనే రూల్ చట్టంలో లేదు. అవగాహన లేని వారిని నియమిస్తే అరకొర జ్ఞానంతో వారు సరైన తీర్పులు ఇవ్వకపోతే అది మరింత సమస్యగా మారుతుంది.ల్యాండ్ డాక్యుమెంట్స్‌ను తాకట్టు పెట్టి, ప్రైవేటు వ్యక్తుల వద్ద డబ్బు తీసుకుంటూ ఉంటారు. ఇకపై అది కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు చెప్పే చేయాలి. లేకపోతే చెల్లదు.కొత్త చట్టం ప్రకారం దస్తావేజులు కూడా పనికిరావు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ ఇచ్చే పత్రాలే ఫైనల్. ఇలాంటి ఎన్నో లొసుగులు ఇందులో చొప్పించడమే ప్రజాగ్రహానికి కారణమైంది.. అందుకే మీనమేషాలు లెక్కించకుండా కొత్త ప్రభుత్వం ఆ చట్టంపై వేటు వేసింది.. మళ్ళీ కొత్త సవరణలతో చట్టం తీసుకువస్తారా.. లేక పాత విధానాలనే కొనసాగిస్తారో చూడాలిమరి…

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More