అది అమ్మవారి ఆలయమైన.., అయ్యవారి ఆలయమైన మూలవిరాట్ పైన దేవతామూర్తి తో పాటుగా మాకొక ఆర్చి లాంటి తోరణం మనకి దర్శనం ఇస్తుంది.. కనుగుడ్లు ముందుకు చోచ్చుకుని కొరపళ్ల మధ్య నుంచి నాలుక బయటకొచ్చిన భీకరాకార రాక్షసముఖం మనకి దర్శనమిస్తుంది.. ప్రశాంత మైన దేవతామూర్తి దగ్గర ఆ భయాంకరాకారం ఎందుకు.. రాక్షసముఖాన్ని ఆ తోరణం మధ్యభాగంలో ఎందుకు అమర్చారు..? అసలు ఆ తోరణాన్ని ఏమంటారు..? దానికి స్కందమహాపురాణం మనకి సమాధానం ఇస్తుంది. పూర్వం “కీర్తిముఖుడు” అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి వరముల ద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సకల లోకాలను జయించి వర గర్వంతో సాక్షాత్తు పరమశివుని పత్ని అయిన ‘జగన్మాతను’ కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి ఆగ్రహించిన మహేశ్వరుడు మ్రింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.· మరణంలేకుండా వరం పొందినప్పటికి, శివుని ఆఙ్ఞతో ఉద్భవించిన బడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివున్నే మళ్ళీ శరణు వేడి స్తుతించడంతో బోళాశంకరుడు కీర్తి ముఖుడి కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్ను గా ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తన ఆకలి తీరేందుకు ఏదైనా చూపమని మహాదేవుని కోరగా పరమశివుడు యుక్తిగా “నిన్ను నువ్వే తిను” అని చెప్పడం తో శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. అయినప్పటికీ తన ఆకలి తీరని మొసలి రూపం లో ఉన్న కీర్తి ముఖుడికి తలను ఎలాతినాలో తెలియలేదు. ఆకలి తీరని ఆ రాక్షసుడు శివుని ప్రార్థించి తరుణోపాయాన్ని చెప్పామనగా ఇదంతా శాపవసాన జరిగిన ఘటనగా వివరించి ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో మూలమూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చి నీవు కొలువుండే తోరణాన్ని మకరతోరణంగా పిలుస్తారని అనుగ్రహించాడు. ఆనాటినుంచి కీర్తిముఖుడు దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడని భక్తుల విశ్వాసం.