భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా లో వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ గారు, అబ్దుల్ కలాం గారి పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn చంద్రబాబు నాయుడు గారికి, విద్యా శాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి అభినందనలు తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి – విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమని. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు.
ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో అమలు చేయడం సముచిత నిర్ణయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుందని మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ గారి పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ గారు. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయి. అలాగే మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం గారి పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. కలాం గారి జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు.
మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని ఆకాంక్షించారు.