ఎంతో భవిష్యత్ ఉన్న యువనటుడు సుధీరవర్మ (కుందనపు బొమ్మ ఫేమ్) ఆత్మహత్య తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు చాలామందిని విషాదం లోకి నెట్టేసింది. ఇదేదో ఇప్పుడే జరిగింది కాదు.. గతం లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.. సామాజిక సమస్యలు కొంతమందిని మరణం వైపు నడిపిస్తుంటే మానసిక రుగ్మతలు మరికొందరి ఊపిరి ని తీస్తున్నాయి.. ఆత్మహత్య కు పాల్పడిన ఆ యువనటుడు మరణం వెనుక కూడా ఇలాంటి మానసిక కారణమే వుందన్న కోణం బలంగా వినబడుతోంది. నిజానికి ప్రస్తుత సమాజంలో చాలామంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. బయటకు బాగా కనిపించినప్పటికీ తమకు గల మానసిక వ్యాధితో తీవ్రంగా కుంగిపోతున్నారు. ఆ వ్యాధి కారణంగా తీవ్ర ఒత్తిడిలకు లోనయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డి.పి.ఎం.పి. అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా కన్వీనర్, సామాజిక ప్రజా వైద్యులు డాక్టర్ కుప్పిలి సురేష్ బాబు చెప్తున్నారు.. ఇటీవల కాలంలో చాలామంది ఇదే కారణంతో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అంటున్నారు. బై పోలార్ డిజార్డర్ అనేది మెదడులోని డొపామైన్ హార్మోన్‌లలో అసమతుల్యత కారణంగా సంభవించే ఒక రకమైన మానసిక రుగ్మత. ఈ అసమతుల్యత కారణంగా ఒక వ్యక్తి మానసిక స్థితి లేదా ప్రవర్తన తీవ్రంగా మారుతుంది. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తి పిచ్చిగా ప్రవర్తించడం, లేదా డిప్రెషన్‌లోకి వెళ్లడం కనిపిస్తుంది. అతని ప్రవర్తనలో తీవ్రమైన హెచ్చు తగ్గులుంటాయి. బై పోలార్ డిజార్డర్ వల్ల ఆ వ్యక్తి ఒక్కోసారి స్పృహ కోల్పోతాడు. లేదంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. తనకు నిద్ర అవసరం అన్నది మర్చిపోతాడు. అయినా అలసి పోకుండా ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి అవసరమైనదానికంటే ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తాడు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు.అతని మనసు స్థిరంగా ఉండదు. అలాగే ఇలాంటి వారికి ఆత్మహత్య (suicide tendency) ఆలోచనలు ఎక్కువ గా వుంటాయని డాక్టర్ కుప్పిలి సురేష్ బాబు చెప్పారు. థైరాయిడ్, రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం, మానసిక రుగ్మతలు అంటు వ్యాధులు కావు. వీటిని నియంత్రించవచ్చు కానీ పూర్తిగా తొలగించలేమని మెదడుతో సంబంధం ఉన్న ఇలాంటి రుగ్మతలన్నీ జన్యు సంబంధమైనవని, ఇంట్లో పెద్దవాళ్లు ఎవరికైనా ఈ సమస్య ఉంటే, పిల్లల్లో కూడా అవి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మెదడులో గల న్యూరో కెమికల్స్ లో జరుగు ఇంబాలన్స్ వలన మూడ్ చేంజెస్ అనేది వస్తుందని, మనం పెరిగిన వాతావరణం, జన్యుపరంగా, వంశపారంపర్యంగా, చిన్ననాటి నుండి చూసిన కుటుంబ కలహాలు భిన్న పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, అనుకున్న కోరికలు జరగకపోవడం, వ్యసనాలకు బానిసైన వారు, చదువు ముందుకు సాగకపోవడం, మెదడులో గల భావోద్వేగాలకు సంబంధించిన భాగంలో సమస్య ఏర్పడడం వలన మొదలగు కారణాలవల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఎవరిలోనైనా ఇది రావచ్చని ఇది రెండు దశలలో ఉంటుందని అన్నారు. అలా ఉత్సాహంగా ఉన్న దశను మ్యానిక్ దశ అని అలాగే చాలా విచారంగా ఉన్న దశను డిప్రెసివ్ దశ అంటారని వెల్లడించారు. అతి సంతోషం, నిద్ర తక్కువ, చాలా కోపంగా ఉండడం, ఎక్కువ ఖర్చులు పెట్టడం, పనిమీద ఏకాగ్రత లేకపోవడం, వాళ్ల కోసం వాళ్లు పెద్ద గొప్పగా చెప్పుకోవడం, అనుమానాలు అహంకారాలు, తనలో తను మాట్లాడుకోవడం , తనలో తను ఏడవడం ,నవ్వడం మాట్లాడుకోవడం, ఎక్కువ బాధపడటం, ఎప్పుడూ నెగిటివ్ ఆలోచించడం, యాక్టివిటీ తక్కువ చేయడం, యాక్టివిటీ లేకపోవడం, నిద్ర ఎక్కువ లేదా తక్కువ, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం, ఆత్మనున్యతా భావము కలగడం ,కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, మొదలగునవి ఈ వ్యాధి లక్షణాలని తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి సైకలాజికల్ ఎడ్యుకేషన్, కాగ్నైటెడ్ బిహేవియర్ థెరపీ తప్పనిసరి అని చెప్పారు. వాడుతున్న మందులను సడన్ గా మానేయకూడదని,దీనివలన మానసిక వ్యాధులు మరల మరల వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఏదైనా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రారంభంలోనే చికిత్స తీసుకోవడం, మందులు సకాలంలో సరైన కాలంలో వాడుతూ.ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాట్లను మానేయాలని అన్నిటికి మించి ఇలాంటి రుగ్మత వీళ్ళలో గుర్తించిన వెంటనే విపరీతమైన కేరింగ్ తో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అంటున్నారు