తీసుకున్న అప్పును ఆదుకున్న సాయాన్ని అవకాశం ఉంటే మర్చిపోయి.. ఎగవేసే రోజుల్లో పయనిస్తున్నాం.. హ్యుమానిటీ.. నిజాయితీ.. కేవలం వాట్సాప్, ఫేస్బుక్, కొటేషన్ లో తప్పా మనుషుల మనస్తత్వాల్లో భూతద్దం పెట్టి వెతికిన దొరకని పరిస్థితుల్లో పరుగులు పెడుతున్నాం.. ఓ చిన్న అరటిపండు దానం ఇస్తూ గొప్పగా ఫోటోలు షేర్ చేసే గ్రూపుల్లో సంచరిస్తున్నాం. అలాంటిది ఎప్పుడో చెల్లించిన బిల్లు గుర్తు చేసుకుని మరి చెల్లించడమే కాకుండా దానికి వడ్డీని కూడా చేర్చి పంపిన ఒక మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. వెండితెరపై చెరగని సాహితీ సంతకం చేసిన చిరస్మరణీయులు ముళ్లపూడి వెంకటరమణ గారికి సంబంధించిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ అయి చక్కర్లు కొడుతుంది ఇద్దరు వ్యక్తులు ఒకే ఆత్మ గా అద్భుతాలు సృష్టించిన బాపూ రమణ గార్ల ‘పెళ్ళికొడుకు’ చిత్రానికి నిర్మాణ సారధిగా వ్యవహరించిన ముళ్ళపూడి వెంకటరమణ గారు ఓ పత్రికలో వేసిన ప్రకటనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఆ సమయంలో కట్టలేకపోయినా దాదాపు 8 సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా చెల్లించిన వైనం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనమే అవుతుంది. 1968 లో విడుదలైన ‘బంగారు పిచ్చుక’కు రీమేక్ గా శ్రీ సీతారామ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన పెళ్ళికొడుకు చిత్ర నిర్మాణ బాధ్యతలన్నీ ముళ్లపూడి వారే చూసుకున్నారు నరేష్ దివ్యవాణి నాయక నాయకులుగా నటించిన ఈ చిత్రం ఆర్థికంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. జగతి అనే పత్రికలో పెళ్లి కొడుకు అడ్వర్టైజ్మెంట్ వేసినందుకు గాను చెల్లించాల్సిన 2500 రూపాయలను అప్పట్లో ఆర్థిక నష్టాల కారణంగా చెల్లించలేకపోయారు ఇప్పటి వాళ్లయితే దాందేముంది లైట్ తీస్కో అనుకునేవారు. అయితే ఎనిమిదేళ్ల అనంతరం చెల్లించాల్సిన ఆ 2500 రూపాయలకు మరో 2500 కలిపి 5000 రూపాయలు చెక్కుని జతచేస్తూ రాసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి రావడంతో మరోసారి ముళ్ళపూడి వారి వ్యక్తిత్వం చర్చ లోకి వచ్చింది. తనకు రావలసిన బాకీలను, స్క్రిప్ట్ రాయించుకుని పారితోషకం ఇవ్వాల్సినప్పుడు మొహం చాటేసిన వ్యక్తులను, నిట్ట నిలువున మోసం చేసిన ద్రోహులను ఏరోజు బయటకీడ్చని ఆయన ఎప్పుడో చెల్లించాల్సిన బిల్లును గుర్తు చేసి మరి పంపించడం మహోన్నతం కాక మరి ఇంకేమిటి అందుకే వాళ్ళు అంత గొప్పోళ్ళు.. మన తెలుగు జాతి గొప్పతనానికి గీటురాళ్లు.. ఎప్పటికి మన హృదయాలపై కొలువుండే ఆనవాళ్లు..