ఫైబర్ నెట్ ఫస్ట్ డే ఫస్ట్ షో హిట్టవుతుందా..?

ఏపీ సర్కార్ ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ద్వారా ఎంటర్టైన్మెంట్ ని తక్కువ ధరకి ప్రేక్షకులకు అందిస్తామని కొత్త సినిమాని విడుదల రోజే కేవలం రూ.99 కే ఇంటి వద్దనే కూర్చొని చూసేలా పథకం ప్రకటించి అధికారికంగా లాంచ్ చేశారు. దీనిపై సినీ పరిశ్రమ నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది.. కొందరు దీన్ని వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్థిస్తూ సానుకూలంగా స్పందిస్తున్నారు…రెవెన్యూ షేరింగ్‌ విధానంలో ఫైబర్‌నెట్‌, మూవీ మేకర్స్‌ మధ్య జరిగిన ఒప్పందం మేరకు తొలిసారి ఫైబర్‌నెట్‌లో నిరీక్షణ అనే కొత్త చిత్రం కూడా రిలీజ్‌ చేశారు. అయితే అది చిన్న చిత్రం కావడం తో ఎంత మంది చూసారు…? మేకర్స్ కి అది వర్కౌట్ అయిందా అన్నది ఇంకా తెలియ రాలేదు.. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఏంటీ ? తెలుగులో ప్రతి ఏటా వందలాది సినిమాలు విడుదల అవుతుంటాయి. అయితే, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటోంది. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారు కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ అన్నది ప్రభుత్వ వర్గాల మాట.. ఏపీ ఫైబర్‌ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా కేవలం రూ.99 కే ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ సినిమాలు చూడొచ్చు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రస్తుతం ఏపీ ఫైబర్‌నెట్‌లో 8 లక్షల కనెక్షన్లున్నాయని అధికారులు చెబుతుండగా మంత్రులు మాత్రం తొమ్మిది లక్షల కనెక్షన్లు ఉన్నాయని వెల్లడిస్తున్నారు. అయితే అందులో ఐదు లక్షలమంది చూసినా కోట్లల్లో ఆదాయం వస్తుందని అంచనా వేసింది ఏపీ సర్కార్.. అసలు ప్రభుత్వ టార్గెట్ ఫైబర్ నెట్ కనెక్షన్లను 50 లక్షలకు పెంచాలని అందుకు అనుగుణంగానే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ తీసుకొచ్చారన్నది కొందరి వాదన.. ఒకవేళ కొత్త సినిమా ని డైరెక్ట్ గా తమ ప్రభుత్వ ఫైబర్ నెట్ లో అందుబాటులోకి తేవాలంటే ముందు సినీ పెద్దలతో చర్చించాలి. దీనికి నిర్మాతలు ఎగ్జిబిటర్లు పంపిణీదారులు అంగీకరిస్తారా? అన్నది బిగ్ క్వశ్చన్. ఇప్పటికే ఎగ్జిబిషన్ రంగం తునాతునకలైంది. ఏపీలో సగానికి సగం థియేటర్లు కళ్యాణ మంటపాలుగా మారాయని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటప్పుడు డైరెక్ట్ గా ఇంట్లో కూచుని 80 ఇంచిల టీవీ లో థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ తో సినిమా ని కుటుంబ సమేతంగా వీక్షించేయవచ్చు అని ప్రకటిస్తే ఇక థియేటర్ల కు వచ్చేది ఎవరు? అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. థియేట్రికల్ రంగానికి ఇది వెన్నుపోటు లాంటిదేనని కొందరు విశ్లేషిస్తున్నారు. ఫైబర్ నెట్ 99 రూపాయలు తీసుకుని ఇచ్చే సినిమాలను జనాలు ఎంతమేరకు చూస్తారు.. చిన్న సినిమాలను డబ్బు పెట్టి చూసే అవకాశం అసలుందా..? పెద్ద నిర్మాతలు దీనివైపు చూసే అవకాశం వుంటుందా..? అలా చూస్తే పైరసీ మాటేమిటి..? అన్నింటికి అనుకూల సమాచారమే తప్ప వాస్తవ సమాచారం ఎవరిదగ్గర లేదు.. ఇలా ప్రసారమైన చిన్న సినిమాలను మరో మాధ్యమం కొనుక్కోదు.. కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాత ఏపీ ఫైబర్ ద్వారా వచ్చే వేల రూపాయలతో సంతృప్తి చెందుతాడా..? దేనికీ వీళ్ల దగ్గర ఆన్సర్లేదు.. ఓ వైపు యాక్ట్ (ఏసిటి) నెట్ ఇప్పటికే రాష్ట్రంలో నంబర్ వన్ గా ఉంది. నాణ్యత సర్వీస్ పరంగా ఉత్తమంగా ఉన్న కేబుల్ వ్యవస్థను కాదనుకుని నాణ్యతలేని ఇతర కేబుల్ నెట్ వర్క్ ల జోలికి ప్రజలు పోవడం లేదు. ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ అనేది ఒకటుందని ప్రజలకు తెలుస్తోందే కానీ అంతగా దీనికి ఆదరణ లేదని టాక్ ఉంది.సరైన సమయంలో నెట్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సమస్యకు పరిష్కారం ఇవ్వలేకపోతున్నారని తక్కువ స్టాఫ్ తో ఏపీ ఫైబర్ నెట్ రన్ అవుతోందనే విమర్శలున్నాయి. ఇలాంటప్పుడు నాణ్యమైన పనితనానికి ప్రయత్నించాల్సింది పోయి సినీ ఇండస్ట్రీ పై పడటం దేనికో అంటూ విమర్శలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి. నిర్మాత సి కళ్యాణ్ లాంటి వాళ్లయితే మాత్రం అనేక దేశాల్లో పస్ట్ డే పస్ట్ షో వంటి ప్రయోగమే లేదని, మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఇది ఎంతో ఉపయోగమని, పస్ట్ డే పస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు. దీనివల్ల తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదని, చిన్న సినిమాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని, పస్ట్ డే పస్ట్ షో అనేది మంచి ప్రయోగమని కూడా సమర్థిస్తున్నారు. దీనివల్ల చిన్న సినిమాలు బతుకుతాయని, దీనిపై కొంతమంది సినిమా వాళ్ళు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అందరి అభిప్రాయం తన అభిప్రాయంగా చెబుతున్నారు. సి.కళ్యాణ్ వంటి నిర్మాతలు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక ఓటిటి సంస్థలు ఉన్నాయి. మంచి నాణ్యతతో సినిమాలను అందిస్తున్నాయి. నాసి రకంగా ప్రసారాలను అందజేస్తున్న ఏపీ ఫైబర్ నెట్ లొనే సినిమాలు ఎందుకు చూడాలని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. సినిమా పరిశ్రమను ప్రభుత్వం టార్గెట్ చేసిందని గతంలో కూడా థియేటర్ టిక్కెట్ల విషయంలో సినిమా వాళ్ళను ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ అంటూ సినీ పరిశ్రమపై తనకు ఉన్న అక్కసును వెల్లగక్కుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని నాశనం చేయడమే పనిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More