అడుగడుగునా..

మునుపెన్నడూ లేనంతగా ప్రతి ఏరియా లో పోలీసు బృందాలు కాపు కాస్తున్నాయి.. వీడియో కెమెరా సాక్షిగా చెకింగ్ లు ముమ్మరం చేశారు.. ఇదేదో దొంగల్ని పట్టుకోడానికో సంఘ వ్యతిరేఖ శక్తులను అదుపు చెయ్యడానికో కాదు.. డిక్కీల్లోనూ, కారు డాష్ బోర్డుల్లోనూ, సీట్ల కిందా.. మేట్ల కిందా దాగిన కట్లపాముల్ని బయట పెట్టేందుకు.. ఎన్నికల్లో డబ్బు, ఇతరత్రా ప్రలో‌‍భాలను అరికట్టేందుకు పోలీస్ చెక్ పోస్టులు సహా ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లు నిరంతరం గా ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి తీసుకొచ్చారు. దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే దాదాపు రూ. 170 కోట్ల డబ్బు, బంగారం, వెండి, లిక్కర్, మత్తు పదార్థాల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఎన్నికల నిబంధనలను అనుసరించి తగిన ఒక వ్యక్తి 50 వేల రూపాయలు అంతకుమించి తీసుకెళ్లాలంటే తగిన ధ్రువీకరణ పత్రాలతో దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేలా డాక్యుమెంట్స్ కచ్చితంగా ఉండాలి.. ఎక్కడి నుంచి డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి తీసుకున్నారు? దానికి తగిన డాక్యుమెంట్స్ చూపించి పెద్ద మొత్తంలో నగదు ఎక్కడికి తీసుకెళుతున్నారో వివరించాలి. అదే బంగారం అయితే దానికి సంబంధించిన బిల్లులు తప్పనిసరి. పోలీసులు లేదా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో నగదు లేదా వస్తువులు సీజ్ చేసినప్పుడు పూర్తి వివరాలతో రసీదు ఇస్తారు. సీజ్ చేసిన సొమ్ము తిరిగి పొందాలంటేఇచ్చిన రసీదు ఆధారంగా జిల్లా స్థాయిలో అప్పీల్ చేయవచ్చు. రోజూ సమావేశమయ్యే జిల్లా స్థాయి గ్రీవెన్స్ విచారణ చేసి ఎన్నికలతో సంబం‌ధం లేదని తేలితే డబ్బును తిరిగి వెనక్కి ఇస్తుంది. ఇలా సీజ్ చేసిన డబ్బు ను గాని గోల్డ్ గాని కొన్నిసార్లు ట్రెజరీకి కొన్ని సార్లు నేరుగా కోర్టుకి తరలిస్తారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారమే ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. మరో విషయం ఏంటంటే ఆన్‌లైన్‌లో డబ్బు పంపించడం లేదా ఫోన్ పే, గూగుల్ పే సహా యూపీఐ పేమెంట్స్ చేసినా కూడా తెలిసేలా ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.ఈ విషయంలో బ్యాంకులు, ఆదాయ పన్ను(ఐటీ) వి‌‍భాగం ఒకే గొడుగు కిందకు వచ్చి పనిచేస్తున్నాయి. ఒక బ్యాంకు అకౌంట్ నుంచి సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా జరుగుతుంటే ఆ వివరాలు సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి వచ్చిన డేటా ప్రకారం నేరుగా ఐటీ విభాగం రంగం లోకి దిగుతోంది.రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడాన్ని నియత్రించే చర్యల్లో భాగంగా ఎన్నికల కమీషన్ తీసుకొచ్చిన ఈ చర్యలకు చాలా సందర్భాలలో సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెళ్లికి దాచుకున్న పెద్ద మొత్తం బంగారం షాపుకు తీసుకెళ్లే సమయంలో.. ఊళ్లలో పొలం అమ్మగా వచ్చిన డబ్బు తీసుకెళ్లే క్రమంలో.. హాస్పిటల్ బిల్లు కింద అర్జెంటుగా లక్షలు చెల్లించాల్సిన టైం లో అప్పుడు డబ్బు సీజ్ చేస్తే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు సంబం‌‍ధిత డాక్యుమెంట్లు చూపిస్తే చాలని ఎన్నికల సంఘం చెబుతోంది . అలాగే అధికారులు పది లక్షల రూపాయలకు మించి సొమ్మును ఇలా విడిచిపెడుతుంటే మాత్రం ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో డబ్బుల తరలింపుపై అస్సలు మినహాయింపులు ఉండవు. బ్యాంకులు డబ్బు తీసుకెళుతున్నా పోలీసులు ఆపితే తగిన ధ్రువీకరణపత్రాలు చూపాల్సిందే అని అధికారులు చెప్తున్నారు..ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే నేరుగా ఎన్నికల సం‌‍ఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ‘‘సీవిజిల్ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో ఫోటోలు, వీడియోలు వీడియో తీసి అప్ లోడ్ చేయవచ్చు.ఫిర్యాదుదారు పేరు, ఫోన్ నంబరు గోప్యంగా ఉంచుతారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More