ప్రభుత్వ మార్పు టాప్ అమరావతి కి మళ్ళీ ఆక్సిజన్ అందింది.. రాష్ట్రం లో ఏ వర్గం ఎలా వున్నా అమరావతి ప్రాంతం మాత్రం ఈ సారి రాజధానిగా వెలుగొందడం ఖాయమన్న ధీమా లో ఉంది. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపధ్యంలో సిఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సిఆర్డిఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు.గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టగా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్ళుగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి.ప్రస్తుతం మరలా అపనులన్నీ శర వేగంగా పున:ప్రారంభం కానున్నాయి.అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం యుధ్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా రాజధాని ప్రాంతంలో 83 జెసిబిలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంఖు స్థాపన ప్రాంతంలోను,సీడ్ యాక్సిస్ రహదారి,కరకట్ట రహదారి సహా ఇతర మాస్టర్ ప్లాన్ లోని ప్రధాన రహదారులు వెంబడి చిన్న చిన్న మరమ్మత్తులు నిర్వహించడం,తుప్పలు తొలగించడం,విద్యుత్ దీపాల పునరుద్ధరణ వంటి పనులను సిఆర్డిఏ అధికారులు చేపట్టారు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నారు. గతంలో 2014లో అమరావతి రాజధానికి శంఖుస్థాపన జరిగిన సమయంలో ప్రస్తుత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ కమీషనర్ గా ఉండడంతో ఆయనకు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులపై పూర్తి అవగాహన ఉంది. రాజధాని ప్రాంతంలో అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు.ముందుగారాజధాని ప్రాంతానికి సంబంధించి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెంలోని సిఆర్డిఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు.ఐ ఏ ఎస్ అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎంఎల్ఏల క్వార్టర్లు,ఎపి ఎన్జిఓ ఉద్యోగుల నివాస భవన సముదాయాలను సిఎస్ పరిశీలించారు.అలాగే 10 ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్,హేపీ నెస్ట్ వంటి నిర్మాణాలను సిఎస్ పరిశీలించారు. అదే విధంగా ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైకోర్టు అదనపు భవన సముదాయాన్ని కూడా సిఎస్ పరిశీలించారు. అనంతరం నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమరావతి రాజధాని ప్రాంతంలో పనులను శరవేగంగా ఏవిధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే దానిపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సిఆర్డిఏ అధికారులతో చర్చించారు.