రైతు తన వ్యవసాయ భూమిని చదును చేస్తున్న సమయంలో అతనికి దొరికిన పురాతన వస్తువులను చూసి షాక్ కు గురయ్యాడు. అందులో బొమ్మల తో పాటు ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించాడు. సమాచారం తెలుసుకున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) అధికారులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది.ఇవి తామ్రయుగం కాలం నాటి వస్తువులుగా గుర్తించారు. ఇక అసలు విషయానికి వస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో మైన్‌పురీ జిల్లాలోని కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో బహదూర్ సింగ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని చదునుచేస్తుండగా ఈ పురాతన ఆయుధాలు కనిపించాయి. తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అక్కడికి చేరుకుని వారం రోజుల పాటు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో క్రీస్తుపూర్వం 1600-2000 కాలానికి చెందిన రాగితో తయారుచేసిన ఆయుధాలు, కుండ పెంకులుగా గుర్తించారు. అధికారులకు 77 రాగి వస్తువులు లభించాయి. ఇందులో 16 మానవ బొమ్మలు, 3 రకాల కత్తులతోపాటు ఈటెలు లభ్యమైనట్లు అధికారులు వివరించారు.