వైసీపీలోకి గంటా.. త్వరలో అధికారిక ప్రకటనంటూ ప్రచారం.

టిడిపి హయాంలో జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు పార్టీ మార్పు పై స్పష్టత వచ్చింది. త్వరలోనే అధికార వైసీపీ పార్టీలో చేరుతారనే విషయంలో స్పష్టత వచ్చిందని విశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొలిటికల్ వాట్సప్ గ్రూపులలో కూడా ఈ వార్త హల్చల్ చేస్తుంది. చాన్నాళ్ళ నుంచి వైసీపీలోకి చేరేందుకు గంటా చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతూనే ఉన్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది టిడిపి నేతలు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అదే క్రమంలో గంటా కూడా ప్రయత్నాలు చేశారు. అతని ప్రయత్నాలకు మాజీమంత్రి, వైసిపి భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అడ్డుగా ఉన్నారని ప్రచారం జరిగింది. అతని వల్లే గంటాను పార్టీలోకి చేర్చుకోలేదని వైసీపీ నేతలు చెప్పడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా గంటాను వైసీపీలోకి ఆహ్వానించేది లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి చేరడం గంటా శ్రీనివాసరావుకు ఆనవాయితని అతని ప్రత్యర్ధులు చెబుతున్నారు. అతను ఏ పార్టీలోకి మారిన ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కీలక నేతగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇప్పుడు గంటా వైసీపీలోకి వస్తే భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో గంటా పేరు చెబితేనే ఒంటి కాలిపై లేచే అవంతి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. తనకోసం ఎవరు ఎటువంటి ఆరోపణలు చేసిన, విమర్శలు చేసిన సరే అధికార పార్టీలోకి చేరేందుకే గంటా మక్కువ చూపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గంటా శ్రీనివాసరావు టిడిపి కి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొనకుండా ఉన్నారు నిజానికి చెప్పాలంటే ఆయన టిడిపికి దూరంగానే ఉన్నారనే చెప్పొచ్చు ఒక స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను ప్రకటించారు.అంతేతప్ప టిడిపి చేపట్టిన కార్యక్రమాలలోనూ, నిర్వహించి కార్యక్రమాలలోను గంటా ఏనాడు పాల్గొనలేదు. తనకు అచ్చి వచ్చిన భీమిలి నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ తిష్ట వేసి కూర్చున్న అవంతి శ్రీనివాసరావు ఆ నియోజకవర్గంలో మళ్లీ తానే పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఖాయమనే స్పష్టత రావడంతో ఆసక్తికర చర్చకు తెరలేచింది. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. రాజకీయ సమీకరణాలు కూడా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా టిడిపిని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా అటు బిజెపి కానీ వైసీపీ కానీ ప్రయత్నిస్తుంది. పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు నాయుడు ల కలయిక కూడా పై ఆ ఇరు పార్టీలు అలర్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబునాయుడు నుంచి దూరం చేస్తే బాధ్యతను బిజెపి పూర్తిగా తన భుజాలనెత్తుకుంది. ఇక రాష్ట్రంలో టిడిపి సీనియర్లను, సానుభూతిపరులను తన పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా టిడిపిని వచ్చే ఎన్నికల్లో దారుణంగా దెబ్బ కొట్టాలని వైసిపి ఆలోచిస్తుంది. ఈ సమీకరణాల నేపథ్యంలోనే విశాఖలోని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. విశాఖలో వచ్చే ఎన్నికలలో టిడిపిని కోలుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తున్న అధిష్టానం గంటా చేరిక పై కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది. నేడో రేపో గంటా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 1న గంటా పుట్టినరోజు సందర్భంగా పార్టీ మార్పుపై అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More