★ 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయా ? ★ పొత్తుపై టిడిపి- జనసేన క్లారిటీతో ఉన్నాయా ? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అని పదేపదే చెప్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారనేది జనసేన నేతలు స్పష్టం చేస్తునప్పటి పొత్తు చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తమకు తోచింది చెప్పేస్తున్నారు. 2014లో బిజెపి, టిడిపి, జనసేన కలిసి బరిలోకి దిగి సృష్టించిన ప్రభంజనాన్ని తిరిగి పునరావృతం చేసే అవకాశం ఉందని సామాన్య ఓటర్ కూడా విశ్లేషణ మొదలుపెట్టేసాడు ఆరు నూరైనా ఈసారి ఈ టీం లోకి బిజెపి వచ్చేది లేదని ఆ పార్టీ ఓ వైపు నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తునే జనసేన తోనే ఎన్నికలకు కలిసి వెళ్దామని పేర్కొంటున్నారు. ఇటు టిడిపి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం, అవసరమైతే పార్టీ కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. పొత్తుల వ్యవహారం పై టిడిపి, జనసేన అధినేత ల వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ పెద్దలు మాత్రం మళ్లీ టీడీపీ తో జత కట్టేది లేదని అంటున్నారు. గత ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తాము ఇంకా మర్చిపోలేదని పేర్కొంటున్నారు. ★ టిడిపి- బీజేపీ మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం.. బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కలిసి బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదని వైకాపా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం అవకాశం వున్నప్పుడల్లా టిడిపితో అంట కాగేది లేదని స్పష్టం చేస్తున్నారు. వైకాపా మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలంటే టిడిపితో ఖచ్చితంగా జత కట్టాల్సిందే బిజెపి కేంద్ర నాయకత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచాయగా చెప్పినట్లు తెలుస్తోంది. టిడిపి బిజెపిల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే బాధ్యతను కూడా పవన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ★ జనసేన కి ఇచ్చే సీట్లపై టిడిపి క్లారిటీ ..? టిడిపి- జనసేన మధ్య పొత్తు కుదిరితే కొన్ని త్యాగాల కు సిద్ధపడాలని ఇప్పటికే పరోక్షంగా తన పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ఒకవేళ పొత్తు కుదిరితే 40 అసెంబ్లీ స్థానాలను, 6 పార్లమెంటు స్థానాలను జనసేన కి ఇవ్వడానికి టిడిపి సిద్ధమైందన్నది సమాచారం.ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఇవ్వాలో ఇప్పటికే ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిన రోజున సీట్లపై తమ ప్రతిపాదనలను జనసేన ముందు ఉంచనుంది. ★ రెండున్నరేళ్ళ బాబు, రెండున్నరేళ్ళ పవన్.. ఇప్పుడు మరో ప్రచారం జోరందుకుంది. మూడు పార్టీలు పొత్తులతో బరిలోకి దిగితే. రెండున్నరేళ్ళ చంద్రబాబు నాయుడు, రెండున్నరేళ్ళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రులుగా ఉండేలా ఒప్పందం కుదిరితే నే పొత్తులపై తాము ఆలోచిస్తామనేది బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బిజెపి నేత సోము వీర్రాజు తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని పలు సమావేశాలలో చెప్పడం జరిగింది.ఈ వ్యాఖ్యల పై టిడిపిలో కూడా చర్చ జరుగుతుంది. అటు జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనే చెబుతున్నారు.ఈ ప్రచారంపై గాని, ఈ వ్యవహారంపై పలువురు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అయితే నేరుగా స్పందించలేదు. వైకాపాను మరొకసారి అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యమని చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి ఒంటరిగా వెళ్తామా లేదా అన్నది తమ ఇష్టం అని దీనిపై వైకాపా నేతలు ఇష్టానుసారంగా జనసేనను టార్గెట్ చేసి మాట్లాడితే సహించేది లేదని పవన్ స్పష్టం చేస్తున్నారు. ★ బిజెపిని వీడే అవకాశం ? టిడిపి, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఊహించిన ఫలితాలు వస్తాయనే విషయం పై పవన్ కు ఇప్పటికే స్పష్టమైన అవగాహన ఉంది. ఒకవేళ బిజెపి ముందుకు రాకపోతే తర్వాతే ఏం చేయాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. టీడీపీతో కలిసి పని చేసేందుకు బిజెపి ముందుకు రాకపోతే ఏపీ లోని మిగతా పార్టీలతో కలిసి వైకాపాను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, వైకాపాను అధికారంలోకి రాకుండా చేయడం కోసం అవసరమైతే బిజెపికి కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే బిజెపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన తో కలసి వెళ్లేందుకే సుముఖంగా ఉంది. ★ త్వరలోనే పొత్తులపై ప్రకటన..? పొత్తులపై ఇప్పటికే జనసేన- టీడీపీ పార్టీలు ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. అంతర్గతంగా ఆ పార్టీల మధ్య చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు ఇరు పార్టీలు పొత్తులపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి పవన్ పై కానీ జనసేన పార్టీ నేతల పై కానీ టిడిపి నాయకులు ఏక్కడా కూడా విమర్శించడం లేదా ఆరోపణలు చేయడం జరగలేదు. వారికి అనుకూలంగానే మాట్లాడుతూ తమ పార్టీ స్టాండ్ ఏంటో చెబుతున్నారు.అటు జనసేనాని కూడా చంద్రబాబు నాయుడుపై ఏటువంటి విమర్శలు కూడా చేయకుండా తటస్థంగా ఉంటూ వైకాపాను మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందనేది వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే సిబిఎన్ దత్తపుత్రుడు అంటూ వైకాపా నేతలు వ్యాఖ్యలు చేస్తూ జనసేన పార్టీని రెచ్చగొడుతున్నారు.ఏదేమైనా మళ్ళీ బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు అయితే స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -సనరా వంశీ