పాండ్రంకి బిడ్డ..విప్లవ పోరు గడ్డ సీతారామ రాజు పుట్టి పెరిగింది విశాఖ జిల్లాలోనే

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు విశాఖ జిల్లాతో ఎంతేో విడదీయలేని సంబంధం ఉంది. సీతారామరాజుకు జన్మించిన ఈ చిన్న ఇల్లు విశాఖ పట్నం జిల్లా లోని పాండ్రంగి లో ఉంది. ఈ ఇల్లు రాష్ట్రం నలుమూలల నుండీ వచ్చే అల్లూరి అభిమానులకూ, టూరిస్టులకూ, హిస్టరీ స్టూడెంట్స్ కు ఒక విలువైన జాతి సంపద లాంటిది అయితే ఈ ఊరి వాళ్లకు మాత్రం అది ఒక గుడి. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన తెలుగువాళ్ళలో అగ్రగణ్యుడు, మన్యంలోని ప్రజల హక్కుల కోసం పోరాడి అమరుడైన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుకు జన్మనిచ్చిన ఈ ఇల్లు తమకు దేవాలయంతో సమానం అని పాండ్రంగి వాసులు చెబుతుంటారు. అల్లూరి సీతారామరాజు మరణించి దాదాపు 5 తరాలు దాటిపోయినా ఈ ఊరి వారు మాత్రం అల్లూరి జ్ఞాపకాలను నెత్తిన పెట్టుకున్నారు. అందుకే ఆయన చనిపోయాక ఆయన విగ్రహాన్ని ఈ ఇంటిలో పెట్టి పూజలు జరుపుతున్నారు. ఆయనతో పాటు అల్లూరి తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహాన్ని కూడా ఈ ఇంటిలో ప్రతిష్ఠించారు. సీతారామరాజు లాంటి త్యాగశీలిని జాతికి అందించడంతోపాటు, స్వయంగా ఊళ్ళో ఎన్నో మంచి పనులు చెయ్యడం.. చివరకు ఉన్న కాస్త స్థలాన్ని కూడా వేగుగోపాల స్వామి గుడి నిర్మాణానికి ఇచ్చెయ్యడం లాంటి పనుల వల్ల ఆమె పేరు పాండ్రంగిలో శాశ్వతంగా నిలిచిపోయింది. అల్లూరి పూర్వీకులది పశ్చిమగోదావరి జిల్లా. అయితే బతుకుదెరువు కోసం ఆయన తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ అనేక ప్రాంతాలకు వెళ్లారు. చివరకు విశాఖ జిల్లాకు చేరి సూర్యనారాయణమ్మ స్వస్థలమైన పాండ్రంగిలో ఉండగా అల్లూరి సీతారామరాజు వారికి 1897 జులై 4 న పుట్టారు. కానీ ఆనాటి రికార్డులు సరిగ్గా లేకపోవడంతో అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరిజిల్లా మోగల్లులో పుట్టారని మొదట్లో భావించారు. కానీ ఆయన పుట్టింది పాండ్రంగిలో అని చివరకు తేలింది. దానితో అప్పటికే శిథిలావస్థలో ఉన్న వారి ఇంటిని ప్రభుత్వమూ ఇతర ఎన్జీవోలు కలిపి అభివృద్ధి చేసాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జీవితకథ ఆధారంగా తీసిన సూపర్ హిట్ సినిమా ” అల్లూరి సీతారామరాజు ” హీరో కృష్ణ 1997 లో అల్లూరి జన్మించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భం గా పాండ్రంగి వచ్చి, అక్కడి నాయకులతో కలిసి రీమోడల్ చేసిన అల్లూరి ఇంటిని సందర్శించారని ఊరివాళ్ళు చెబుతుంటారు . పుట్టిన నాటినుండి ఏడేళ్ల వయసు వచ్చేవరకూ అల్లూరి సీతారామరాజు పాండ్రంగి లోనే పెరిగారు. అనంతరం తండ్రి చనిపోవడంతో పాటు, తన ప్రాథమిక విద్య కూడా పూర్తికావడంతో సూర్యనారాయణమ్మ పాండ్రంగిలో ఉండలేక అక్కడి నుండి పిల్లలతో సహా విశాఖ, తుని లాంటి ప్రాంతాలకు వెళ్లారు. కాకినాడ హై స్కూల్ లో కొంతకాలం చదివిన అల్లూరి ,15 ఏళ్ల వయస్సులో మళ్ళీ విశాఖ చేరుకున్నారు. అక్కడ ఏవీఎన ్ కాలేజీలో చేరి కొంతకాలం చదివారు. తరువాత అల్లూరి మేనమామ నరసాపురం ఎమ్మార్వో రామకృష్ణంరాజు, అల్లూరి సీతారామరాజును నరసాపురంలోని టేలర్ స్కూల్ లో చేర్చినా, బ్రిటీష్ చదువులు చదవడం ఇష్టం లేక మధ్యలోనే వదిలేసి కొండల్లోనూ, అడవుల్లోనూ తిరుగుతూ హస్త సాముద్రికం, జ్యోతిష్యం, ఆయుర్వేదం లాంటి వాటిపై పట్టు సాధించారు. సన్యాసం స్వీకరించి గిరిజనులకు వైద్యం లాంటి సేవలు అందిస్తూ వారికి ఇష్టమైన వ్యక్తిగా మారారు. అనంతరం వారు బ్రిటీష్ వాళ్ళ చేతుల్లో పడుతున్న బాధలు చూసి విప్లవం మొదలుపెట్టారు . తరువాతి కథ తెలిసిందే. ఇక అల్లూరి సీతారామరాజు అడవి బాట పట్టడంతో ఆయన తల్లి విశాఖ లోనూ, తుని లోనూ ఉంటూ వచ్చారు. 7 మే 1927 న అల్లూరి ప్రాణత్యాగం తరువాత ఆమె టీచర్ ఉద్యోగం పొందిన తన రెండో కుమారుడితో కలిసి తూర్పుగోదావరి జిల్లాలోని బూరుగుపూడిలో కాలం గడిపారు. తన స్వగ్రామమైన పాండ్రంగికి మాత్రం వెళ్లనేలేదు. కానీ అక్కడ ఉన్న తమ కొద్దిపాటి స్థలం, ఇతర ఆస్తులను వేణుగోపాల స్వామి గుడికి ఇచ్చేసారని ఆ గుడి ప్రస్తుత పూజారి భాస్కరాచార్యులు చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు తల్లి, తమ్ముడు, సోదరి ఊరు వదిలి పెట్టెయ్యడంతో వారి బంధువులు ఆ ఇంటిని కాపాడుతూ వచ్చారు. ప్రస్తుతం వారి వారసులూ పాండ్రంగిలోనే ఉంటున్నారు. అల్లూరి ఖ్యాతి రోజురోజుకీ ప్రఖ్యాతమవుతున్న నేపథ్యంలో ఆయన పుట్టిన ఇంటిని అభివృద్ధి చేసింది ప్రభుత్వం. అలాగే ఎవరూ ఆ ఇంటిలో ఉండకపోయినా.. దానిని మాత్రం ఒక గుడిలా కొలుస్తూ కాపాడుకొస్తున్నారు పాండ్రంగి వాసులు. ప్రతి ఏడూ అల్లూరి సీతారామరాజు పుట్టినరోజును ఘనంగా జరుపుతూ ఆయన పట్ల తమ గౌరవాన్ని తెలుపుతూ ఉంటున్నారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More