పనిచేయకుండా పార్టీలో కొనసాగుతామంటే కుదరదని వైసీపీ నేతలు కార్యకర్తలకు తేల్చి చెపుతున్నారు. పార్టీ బలోపేతానికి అలాగే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. పని చేయకుండా పదవుల కోసం పాకులాడితే పార్టీ పక్కన పెట్టేస్తుందని హెచ్చరికలు పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలోని నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో అధికార పార్టీ నేతలు కార్యకర్తలకు పార్టీ ప్రతిష్టతకు కష్టపడాలని సూచించారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతలపై కూడా విరుచుకుపడ్డ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఓ వైపు ప్రతిపక్ష పార్టీ నేతలను తిడుతూనే.. వైసీపీ కార్యకర్తలకు కూడా చురకలంటించారు. పార్టీలో ఉన్నవారు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తేనే పార్టీకి మైలేజ్ చెప్తూనే పేదవారికి సంక్షేమ పథకాలు ఇస్తే టీడీపీ ఓర్వలేకపోతుందన్న విషయాన్ని కూడా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రానున్న ఎన్నికలు దృష్ట్యా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సరే వైసిపి మెజార్టీ సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టే విధంగా పనిచేయాలని గట్టిగానే చెప్పారు.