టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోగా కొనసాగిన సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అదే స్థానాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరు కనిపించడం లేదు. నేటి జనరేషన్ హీరోలు నంబర్ వన్ స్థానానికి పోటీపడుతున్నప్పటికీ అది సాధ్యమయ్యే అవకాశం అయితే లేదు. ఇకముందు స్టార్ హీరోలు మాత్రమే ఉంటారు. నెంబర్ వన్ హీరో అంటూ అనేది ఏదీ ఉండదని సినీ విశ్లేషకులు చెబుతున్న మాట. గతంలో హీరోని చూసి సినిమా థియేటర్ కు వచ్చే పరిస్థితులు ఉండేవి. అది ప్లాప్ సినిమా అయినా సరే అభిమానులు నెత్తినెక్కించుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. ఎంత స్టార్ హీరో అయినా సరే కంటెంట్ లేకపోతే ఆ సినిమా దరిదాపుల్లోకి ఎవరు రాని పరిస్థితి నెలకొంది. నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవికే ఇటువంటి గడ్డు పరిస్థితి ఎదురైంది. చాలా ఏళ్ల తర్వాత రాజకీయాల అనంతరం తిరిగి తను చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కానీ తర్వాత పరిస్థితులు వేగంగా మారడంతో మెగాస్టార్ చిరంజీవికి కూడా చుక్కేదురైంది. పాన్ ఇండియన్ రేంజ్ లో చిరంజీవి హీరోగా రూపొందించిన సైరా నరసింహారెడ్డి అంతంత మాత్రమే ఆడింది. ఆ సినిమాకి తన స్టార్ ఇమేజ్ ఏమి పని చేయలేదు. సినిమా బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో దానికి కలెక్షన్ లు రాలేదనే చెప్పొచ్చు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య కూడా చిరంజీవిని ఆదుకోలేకపోయింది. మ్యాట్నీ షోకే అది ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాగే తెలుగులో వచ్చిన మరి కొందరు హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చతికల పడ్డాయి. కరోనా సమయంలో చాలామంది ఆడియన్స్ ఓటిటి లకు కనెక్ట్ కావడం తో వారికి వివిధ భాషలకు సంబంధించిన ఎన్నో చిత్రాలను చూసే అవకాశం దొరికింది. ఇంటి వద్ద కుటుంబమంతా చూసే అవకాశం లభించడంతో భారీగా టికెట్ ధరలకు డబ్బులు కేటాయించి థియేటర్ కు వెళ్లి సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎవరు ఇష్టపడటం లేదు. సినిమా కంటెంట్ బాగుంటేనే థియేటర్ కు వస్తున్నారు. స్టార్ హీరో సినిమా కావచ్చు లేదా చిన్న హీరోల సినిమాల కావచ్చు కంటెంట్ లేనిదే ఎవరూ కూడా థియేటర్స్ కు వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి లో నాలుగు పాటలు నాలుగు ఫైట్లు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, కొన్ని కామెడీ సీన్లు చేసి థియేటర్లలో సినిమాలో వదిలేస్తామంటే ఇదివరకటిలా చెలామణి అయ్యే పరిస్థితి లేదు. ఆడియన్స్ థియేటర్ కు రావాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను దర్శక నిర్మాతలు తీయాల్సిందే. ఏదో చేసామని వరుస పెట్టి హీరోలు సినిమాలు తీసుకుపోతే బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడక తప్పదు. సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న రోజులు వేరు. అప్పట్లో వారి సినిమాలు ఎంత చెత్తగా ఉన్నప్పటికీ ఒక్కసారైనా ఆ సినిమా చూడాలని థియేటర్ కు వస్తుండే వాళ్ళు. అప్పట్లో వారి ప్లాప్ సినిమాలకు కూడా భారీగా కలెక్షన్లు వచ్చేవి. తమ నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు అటు అభిమానులకు ఇటు ప్రేక్షకులకు నచ్చే సినిమాల మాత్రమే చేసేవారు. అందువల్లే వారిద్దరి సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి తర్వాత నెంబర్ వన్ స్థానం ఎవరిది అనే ప్రశ్న తలెత్తినప్పుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ముందు వరుసలోకి వచ్చింది. కానీ ఆయన చాలా వరకు తన సమయాన్ని రాజకీయాలకే కేటాయించడంతో ఆ తర్వాత జనరేషన్ హీరోల మధ్య పోటీ పెరిగింది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల మద్యే ఈ పోటీ కొనసాగుతుంది. వీరందరూ కూడా మంచి ప్రతిభ గల నటులు. అందరికీ మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబలైజేషన్ కావడంతో నెంబర్ వన్ హీరో అయ్యే ఛాన్స్ అయితే ఎవరికి లేదనే చెప్పాలి.ఈ జనరేషన్ హీరోలందరూ స్టార్ హీరోలు మాత్రమేనని నెంబర్ వన్, నెంబర్ టూ అంటూ మీడియా వాళ్ళు, అభిమానులు ప్రచారం చేసుకోవడమే తప్ప కంటెంట్ లేకపోతే ఎవరి సినిమాలైన తిరస్కరించే రోజులు. టాలీవుడ్ లో అయితే చిరంజీవి మాత్రమే చివరి నెంబర్ వన్ హీరో అనేది వాస్తవమని అంటున్నారు. ఇప్పుడు స్టార్ హీరోలను చూసి థియేటర్ కొచ్చి ఆ సినిమా ఎంత చెత్తగా ఉన్నా ఆ సినిమాని భుజానికి ఎత్తుకొని హిట్ చేసే పరిస్థితులు లేవన్నది సుస్పష్టం. సినిమా నచ్చకపోతే అభిమానులే డైరెక్ట్ గా అట్టర్ ప్లాప్ సినిమా అని చెప్పేస్తున్నారు. ప్రతి హీరోకి అభిమానులు ఉన్నారు. అభిమాన సంఘాలు ఉన్నాయి. కంటెంట్ ఉన్న మంచి సినిమాలు చేసే వేరే హీరోల సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. గత ఏడాది చివర్లో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసింది. ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా పట్ల పాజిటివ్ గా స్పందించి సినిమా విజయంలో కీలకంగా మారారు. ఆ తర్వాత మంచి కంటెంట్ తో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, యష్ కేజీఎఫ్ మూవీలు కూడా రికార్డులను తిరగ రాసాయి. ఆ తర్వాత వరుసగా భారీ సినిమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే మీడియం రేంజ్ సినిమాలుగా విడుదలైన బింభిసారా, సీతారామం, ఒకే ఇక జీవితం సినిమాలు మంచి కంటెంట్ తో రావడంతో బాక్సాఫీస్ వద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి అంతకుముందు డిజె టిల్లు, పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదలైన అడివి శేషు మేజర్ చిత్రాలు కూడా ఘనవిజయాన్ని సాధించాయి. ఇప్పుడు పెద్ద హీరోనా చిన్న హీరోనా అనేది కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. ఇక్కడ స్టార్ ఇమేజ్ అన్నది పనిచేయడం లేదనేది వాస్తవం. నెంబర్ వన్ స్థానానికి పోటీపడే విషయాన్నీ పక్కన పెడితే స్టార్ హీరోగా తమ స్థాయికి కాపాడుకునేందుకే హీరోలు అపసోపాలు పడుతున్నారు. కళ్ళ ముందు వాస్తవ పరిస్థితులు కనిపించడంతో పెద్ద హీరోలు కూడా ఆచితూచి మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలను చేస్తున్నారు.