అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసం, నీటి కోసం అటవీ సమీప గ్రామాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవి పశువుల పైన, మనుషుల పైన దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ విషపూరిత సర్పాలు, కోతులు, వివిధ రకాల పక్షులు జన రణ్యంలోకి వచ్చేసాయి. కోతుల వల్ల ప్రజలకు అంత ప్రాణాపాయ పరిస్థితి లేనప్పటికీ, కానీ వాటి వల్ల కూడా సమస్యలు ఉన్నాయి. ఇక విష సర్పాలు, కొండచిలువలు వల్ల కూడా ప్రజలకు ప్రమాదాలు తలెత్తుతున్నాయి. చాలామంది పాముకాటుతో మృతి చెందిన ఘటనలు ఇటీవల చాలా జరుగుతున్నాయి. ఇక ఎలుగుబంట్లు సైతం దాడులకు తెగబడుతున్నాయి అటవీ ప్రాంతం సమీపంలో చేపడుతున్న పలు పండ్ల తోటల లోకి చొరబడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్కొసారి ఒంటరిగా మరోసారి గుంపులుగా ఈ తోటలోకి ప్రవేశించి వాటిని నాశనం చేస్తున్నాయి. ఆ సమయంలో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఎలుగుబంట్ల దాడుల్లో చాలామంది తీవ్రంగా గాయపడిన వారు అలాగే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.ఇక ఏనుగుల గుంపు కోసమైతే చెప్పనక్కర్లేదు. పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములలోకి చొరబడి పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఒక్కో గుంపులో సుమారు నాలుగు నుంచి పది ఏనుగులు ఉంటున్నాయి. తమ పంటలను రక్షించుకునే క్రమంలోనే అవి మనుషులపై తిరగబడి దాడులు చేస్తున్నాయి. మరి కొన్ని ఏనుగులు అటవీ సమీప గ్రామాల్లోకి ప్రవేశించి కనిపించిన ఇళ్ల పైన, వాహనాల పైన దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటిని అడ్డుకునే మనుషులపై కూడా దాడి చేసి చంపేసిన సంఘటనలు కూడా వున్నాయి ఇక పులులు, చిరుతలు కూడా ఆహారం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అయితే అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి చిరుతలను తిరిగి అడవులలోకి పంపించే విధంగా చేసిన ప్రయత్నాలు కొన్ని ఫలించాయి. కొన్నింటిని ప్రత్యేక బోనుల ద్వారా పట్టుకొని తిరిగి అడవులలోకి పంపించిన ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు తాజాగా బెంగాల్ టైగర్ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చుట్టేస్తూ గాండ్రిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయనగరం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి జిల్లా ఇలా చుట్టేస్తూ అక్కడి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అది అటవీ ప్రాంతాలలో తిరుగుతూనే సమీప జనావాసప్రాంతాలలో కూడా చొరబడుతుంది. ఇప్పటికీ కొన్ని ఆవులు, గేదెలు దీని పంజాకు బలయ్యాయి. దాని పాదముద్రలను బట్టి అది సంచరించే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. రంగంలోకి దిగిన అధికారులు దాన్ని జాడ కోసం అది సంచరించే ప్రాంతాలలో జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ అది ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ సంచరిస్తుంది అనే దానిని తెలుసుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అది తిరిగే ప్రాంతాలలో దానిని పట్టుకునేందుకు ప్రత్యేక బోనులను కూడా ఏర్పాటు చేశారు. అది బోను వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్లిపోయినట్లు కూడా దాని పాద ముద్రల ద్వారా అధికారులు గుర్తించారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారి (డి.ఎఫ్.ఓ) అనంత శంకర్ పులిని పట్టుకునేందుకు రెస్క్యూ టీం లను కూడా ఏర్పాటు చేసామన్నారు. పులి తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చినట్లుగా గుర్తించామని వెల్లడించారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతాలలో పులుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలో ట్రేస్ అయిందని చెప్పారు. అడవులలో ఏర్పాటు చేస్తున్న రైల్వే ట్రాక్ లు, రహదారుల నిర్మాణం వలన వన్య ప్రాణులు తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్లు భావిస్తున్నాయని అన్నారు. అక్కడ నీటి కొరత, ఆహార కొరత తో పాటు తోడు ని కోల్పోవడం కూడా జంతువులు జనా వాసాల్లోకి రావడానికి ఒక కారణమన్నారు. అడవుల్లో స్వేచ్చగా తిరగాల్సిన వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తున్నాయంటే నానాటికి అంతరించి పోతున్న అడవులే కారణమని అడవుల్లో సైతం మనుషుల అలజడి కారణంగాజంతువులు ఉనికి ఇబ్బంది లో పడిందన్నారు. అంతే కాకుండాఒకప్పుడు అడవులు దట్టంగా ఉండడంతో వన్యప్రాణులకు అవసరమైన ఆహారం అక్కడే లభించేదని, క్రమంగా అడవులు నరికివేత, అక్రమ కలప రవాణా,మైనింగ్ కారణంగా అడవులు అంతరించిపోతున్నాయిని చెబుతున్నారు. దీనికి తోడు అడవులు తగల బడుతుండడం, వర్షాబావ పరిస్థితుల వల్ల చెట్లు చిగురించే పరిస్థితి లేదన్నారు. దీంతో అడవు ల్లో నిలువ నీడ, సరైన ఆహారం, నీరు దొరక్క వన్యప్రాణులు అడవి నుంచి జనవాసాల్లోకి వస్తున్నాయని చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడంతో ఈ సమస్య వస్తుందని అభిప్రాయపడ్డారు.