సినిమా విడుదలైన సినిమా వరకు ఓటీటీలకు రాదు. కొన్ని రోజుల క్రితం సినిమా పెద్దలు అందరూ కలసి కూర్చుని తీసుకున్న నిర్ణయం. కానీ ఇప్పుడు చూస్తే ఆ మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అన్నది వాస్తవం. ఓటిటి లో సినిమా విడుదలపై టాలీవుడ్ తీసుకున్న నిర్ణయం దీనిని ఎంత మంది పాటిస్తారు, నిజంగానే పాటించగలరా, అలా చేస్తే నష్టాలు రావా? ఇలా చాలా రకాల ప్రశ్నలు అప్పుడొచ్చాయి. అప్పుడు నిర్మాతల్లో కొందరు లేదు లేదు మేం మాట మీద నిలబడతాం అని కూడా హామీ ఇచ్చేశారు.. కానీ తాము పెట్టుకున్న నిబంధనలను పాటించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తూచ్ అని ఎవరి పని వారు కానిచ్చేస్తున్నారు.. తాము పెట్టుకున్న నిబంధనలకు ఆరు నెలల వయసు రాక ముందే తామే బ్రేక్ చేయడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టిన పెట్టుబడికి లాభాలు అటునుంచి అసలు రాకపోవడం సినీ ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది. దీంతో తప్పనిసరై థియేటర్స్‌లో టికెట్ ధరలు పెంచేశారు. పెరిగిన టికెట్స్ ధరలు సామాన్యులను థియేటర్స్‌కు మరింత దూరం చేశాయి. పెరగిన టికెట్ రేట్స్ వల్ల ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్- 2 సినిమాలకు మంచి లాభాలనే గడించాయి. కానీ చిరంజీవి ఆచార్యకు అదే టికెట్ రేట్ కొంప ముంచింది. మరోవైపు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాకు టికెట్స్ రేట్స్ పెరుగుదల వల్ల రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు నష్టపోయిందని తెలుస్తుంది. అదే తక్కువగా ఉంటే కలెక్షన్స్ ఇంకాస్త మెరుగ్గా ఉండేవి. మరోవైపు ఎఫ్-3 కూడా పెరిగిన టికెట్స్ కారణంగా లాభాల్లోకి రాలేదు. దీంతో కొత్త సినిమాలు ఓటీటీ విడుదలపై టాలీవుడ్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ళు షూటింగ్ లు బంద్ పాటించి(ఇది కూడా పేపర్ నిర్ణయమే ఆ సమయం లో షూటింగ్స్ బాగానే జరిగాయి) జులై 1 నుంచి థియేటర్లలో సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతగానీ, ఆ సినిమా ఓటీటీలో రావడానికి వీల్లేదన్నది నిబంధన. టాలీవుడ్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇటు థియేటర్లలో బొమ్మ ఆడక, అటు ఓటీటీ నుంచి డబ్బులు రాక నిర్మాత ఎటూ కాకుండా పోయే పరిస్థితి ముందు ముందు రావొచ్చు అనే అభిప్రాయం అయితే సర్వత్ర వ్యక్తమయింది. ఈ నిబంధన విషయంలో సినీ పరిశ్రమలోనే భిన్న వాదనలు వినిపించాయి. కరోనా పాండమిక్ సమయంలో దేశ వ్యాప్తంగా థియేటర్స్ మూత పడటంతో నిర్మాతలకు ఓటీటీ అనేది ఓ వరంలా మారింది. ఆ తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటి అనుకూలించడంతో థియేటర్స్ మళ్లీ తెరుచుకున్నాయి. ఇక నిర్మాతలకు ఇంతకు ముందు థియేటర్స్ బిజినెస్‌తో పాటు శాటిలైట్ బిజినెస్ మాత్రమే ఉండేది. తాజాగా ఇపుడు డిజిటిల్ (ఓటీటీ) స్ట్రీమింగ్ హక్కులతో పాటు డబ్బింగ్ హక్కులు అంటూ నిర్మాతలకు బోలెడంత కలిసొచ్చింది. నిన్న మొన్నటి వరకు నిర్మాతలకు వరంలా మారిన ఓటీటీ ఇపుడు శాపమై కూర్చుంది.. టికెట్ రేట్స్ కూడా సామాన్యులకు అందనంత ఎత్తులో ఉండటం కూడా ప్రేక్షకులు థియేటర్స్ వైపు కాకుండా ఓటీటీలో సినిమా ఎపుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడేలా చేసింది. కరోనా సమయంలో థియేటర్స్‌కు కాకుండా ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడాలంటే అందులో కంటెంట్ బాగుంటేనే ఆ వైపు కదులుతున్నాడు. టాక్ కాస్త తేడా వచ్చినా, రెండు మూడు వారాలు ఆగితే ఎలాగు ఓటీటీలో వస్తోంది కాబట్టి థియేటర్స్‌కు వెళ్లడం అవసరం లేనట్లుగా భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు నిర్మాతలకు బంగారు బాతులా కనిపించిన ఓటీటీ ఫ్లాట్‌పామ్ వల్ల థియేటర్స్ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఇపుడు ఆ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారు టాలీవుడ్ నిర్మాతలు. అయితే నిర్మాతలకు ఓటీటీ వల్ల వారు పెట్టిన పెట్టుబడి తొందరగా రికవరీ అయ్యే అవకాశాలుండటంతో చాలా మంది నిర్మాతలు తాము పెట్టుకున్న నిబంధనలకు తామే తూట్లు పొడిచేస్తున్నారు.. సినిమాని రెండు వారాల్లోనో మూడు వారాల్లోనో ఓటీటీలో విడుదల చేస్తే, దానికి ఓ రకమైన ఒప్పందం వుంటుంది. అదే యాభై రోజుల తర్వాత అంటే ఇంకో రకమైన ఒప్పందం వుంటుంది. లాంగ్ గ్యాప్ అంటే, ఒప్పందాల కారణంగా నిర్మాతకు వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా విడుదలైన మూడు వారాలకే తమ సినిమాలను స్ట్రీమింగ్‌కు ఇచ్చేస్తున్నారు. విడుదలైన తక్కువ రోజులకే ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు హక్కులు అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా మంది నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూడు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేలా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ఆ సినిమా థియేటర్స్‌లో రూ. 300 పెట్టి చూసేకంటే అదే డబ్బులతో సంవత్సరం చందా తీసుకుంటే మొత్తం సినిమాలను చూసేయచ్చు అనే రీతిలో ఆలోచిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ ముఖంగా చూడక వాటి ఉనికి ప్రశ్నార్ధకం అయ్యేలా చేస్తోంది. కొన్ని సినిమాలకు అయితే ఓటీటీనే దిక్కు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. సినీ ప్రేక్షకుడి ఆలోచన మారిపోయింది. ఓటీటీలో బోల్డంత కంటెంట్ దొరుకుతోంది. దాన్ని కాదనుకుని, థియేటర్లకు ప్రేక్షకులు వెళ్ళాలంటే, ఆ సినిమాలో చాలా అద్భుతాలే జరగాలి. కానీ, ప్రస్తుతం వస్తోన్న సినిమాల నుంచి అద్భుతాల్ని ఆశించలేం. మరి ఈ మాత్రానికే దిద్దుబాటు చర్యలు అంటూ సినీ పెద్దలు నిబంధనలు పేరట తీసుకున్న నిర్ణయాలు అంతా హుళుక్కేనా..? అనే విమర్శలు వస్తున్నాయి. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోవడం తమ స్వప్రయోజనాల కోసం వాటిని అమలు చేయకపోవడం ఎప్పుడు జరిగే తంతే.. ఏదైనప్పటికీ భారం మాత్రం ప్రేక్షకుడిపైన పడిందన్నది వాస్తవం. తన జేబు గుల్లకాకుండా ఉండేందుకు ప్రేక్షకుడు కూడా చాలా తెలివిగానే ఆలోచిస్తున్నాడదన్నది కూడా అంతకన్నా వాస్తవం