అల్లూరి సీతారామరాజు సినిమానే సీనియర్ ఎన్టీఆర్ – సూపర్ స్టార్ కృష్ణ ల మధ్య వివాదానికి కారణమని ప్రచారం సాగుతుంది. తను తీయాలనుకున్న సినిమాని కృష్ణ తీశారనే కోపం ఎన్టీఆర్ లో ఉందన్నది కొందరు చెబుతుంటారు. అంతకు ముందు నుంచే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కృష్ణ దృష్టికి వెళ్లినప్పటికీ ఆ సినిమాను ధైర్యంగా తెరకెక్కించి రిలీజ్ చేశారు. తర్వాత ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ఒక చరిత్రను సృష్టించింది. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ పై మనసు పారేసుకున్న ఎన్టీఆర్ ఆ సినిమాను తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నారు. అప్పటికే కృష్ణ తీసిన అల్లూరి సీతారామ రాజు సినిమా విడుదలయి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయినా సరే తను మళ్ళీ ఆ సినిమాను చేసి తీరుతారని నిర్ణయించుకున్నారు. రచయితలు పరుచూరి బ్రదర్స్ ను పిలిపించి ఆ సినిమా పై వర్క్ చేయాలని చెప్పారు. అయితే పరుచూరి బ్రదర్స్ అన్నగారు ఒకసారి మీరు కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూడండి ఆ తర్వాత కూడా మనం అదే పేరుతో సినిమా చేద్దాం అంటే కచ్చితంగా ముందుకు వెళ్దాం అని సూచించారు. ఆ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత కృష్ణ వాహిని స్టూడియో మేకప్ రూమ్ నుంచి బయటికి వస్తుండగా ఎన్టీఆర్ ఆయనకి ఎదురుపడ్డారు. అయితే అప్పటికి కృష్ణకు ఎన్టీఆర్ మధ్య పదేళ్ల నుంచి మాటలు లేవు. వాహిని స్టూడియో ఎదుట కృష్ణను చూసి బ్రదర్ ఒకసారి ఇలా రండి అని ఎన్టీఆర్ పిలిచారు. ఏంటండి అని వినయంగా తిరిగి పలకరించారు కృష్ణ. ఏం లేదు మీ సీతారామరాజు సినిమా చూడాలనుకుంటున్నాను మీరు దగ్గరుండి చూపించాలని అడిగారు ఎన్టీఆర్. ఆ సమయంలో కృష్ణకు విజయకృష్ణ అనే డబ్బింగ్ థియేటర్ ఉండేది. అల్లూరి సీతారామరాజు ప్రింట్ తెప్పించి ఎన్టీఆర్ ని పిలిపించి ఆయనను పక్కన కూర్చోబెట్టి ఆ సినిమాను చూపించారు. సినిమా ఇంటర్వెల్ కి ఎన్టీఆర్ కృష్ణ ను చాలా పొగిడారు. చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. సినిమా అంతా పూర్తిగా చూసిన తర్వాత కృష్ణ ను హత్తుకుని బ్రదర్ సినిమాని మీరు చాలా బాగా తీశారు. చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంత అద్భుతంగా సినిమాను తీసిన మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ కృష్ణ ను మెచ్చుకున్నారు. అంతక ముందు పదేళ్ల క్రితం నుంచి వేర్వేరు కారణాలతో ఇద్దరి మధ్య మాటలు అనేవి అసలు లేవు. ఇప్పుడు ఈ సీతా రామరాజు అనే సినిమా వారి మధ్య చిచ్చు పెట్టిందని పరిశ్రమలోని కొందరు.. అలాగే మీడియా కూడా కోడై కూసింది. కానీ అనుకోకుండా ఇద్దరూ వాహని స్టూడియోలో కలవడం, తర్వాత ఇద్దరు ఆ సినిమాను విజయకృష్ణ డబ్బింగ్ థియేటర్లో కలిసి చూడటం జరిగింది. ఇది ఎవరు ఊహించలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది సంతోషించారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఈ ఇద్దరి మధ్య మళ్ళీ స్నేహబంధం ముడిపడిందని అనుకున్నారు. ఆ సినిమాను చూసిన ఎన్టీఆర్ పరుచూరి బ్రదర్స్ ను పిలిపించి కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు సినిమా చూశాను. చాలా బాగుంది. ఇక మనం ఆ సినిమాను తీయనవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గతంలో విజయనిర్మలతో కలిసి ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ వెల్లడించారు.