కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్ 63వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా “మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు” అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్‌తో ప్రకటన చేసింది. సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. ఒక్క పోస్టర్ తోనే విభిన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సృజనాత్మక పోస్టర్ సినీ ప్రేమికులలో మరియు అల్లరి నరేష్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంకేత భాషలో దాచిన సందేశాన్ని డీకోడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. అల్లరి నరేష్ ఇటీవలి కాలంలో వైవిధ్యమైన, కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా కేవలం ప్రకటనతోనే అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. “ఫ్యామిలీ డ్రామా” చిత్రంతో ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. అల్లరి నరేష్ యొక్క 63వ చిత్రంగా రానున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.