ఎన్నికల హడావుడి ముగియడంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారించేందుకు నందమూరి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి తిరిగి ప్రారంభం కానుందని సమాచారం.. హైదరాబాద్లో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్లో ఈ కొత్త షెడ్యూల్ మొదలు కానుందని తెలిసింది. దీనిలో భాగంగా బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనకు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తుండగా.. విజయ్ కార్తీక్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.