రాజకీయం.. సినిమారంగం రెండు వేరు వేరుగా కనిపించిన ఈ రెండింటి అనుబంధమే వేరు.. ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ పదవుల్లో ప్రజాసేవ చేశారు.. నాటి జగ్గయ్య నుంచి నేటి ఆలీ వరకు చాలామంది రాజకీయాల్లో రాణించిన వారే గత ఐదు సంవత్సరాలనుంచి సినిమా ఇండస్ట్రీ పాలిటిక్స్ పరంగా స్తబ్దుగా ఉన్నప్పటికీ 2024 ఎన్నికల్లో మాత్రం సినిమా వాళ్ళ హవా గట్టిగానే వుండే అవకాశం స్పష్టం గా కనిపిస్తుంది. పోసాని, అలీ తో పాటు మరికొంతమంది అసెంబ్లీ బరి లో నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తన ప్రస్థానం ప్రారంభించి తర్వాత నటుడిగా మారిన సప్తగిరి త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించిన సప్తగిరి కి తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ హామీ కూడా లభించినట్లు సమాచారం.సినీ కెరీర్ పరంగా మంచి స్థాయిలో తనకు ఉన్న ఇమేజ్ ద్వారా రాజకీయాల్లో కూడా రాణించాలని వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకుంటు సామాజిక బాధ్యతగా సేవ కార్యక్రమాలు చేస్తున్న సప్తగిరి కి రాజకీయంగా అది ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. తను చేస్తున్న సేవ కార్యక్రమాల విషయంలో పబ్లిసిటీ అవసరం లేదని కొన్ని ఇంటర్వ్యూ లలోచెప్పిన సప్తగిరి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజలకు నేరుగా మరింతగా సేవ చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని ఎంతో ఇష్టపడే ఆయన రాజకీయపరంగా మాత్రం టిడిపి వైపు మొగ్గు చూపుతున్నాడన్నది సమాచారం.తెలుగుదేశం పార్టీ చిత్తూరు లో అంత స్ట్రాంగ్ కానప్పటికీ స్థానికంగా గెలిచే అవకాశాలు గట్టిగా ఉన్న ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే టిడిపికి చెందిన ప్రధాన నాయకత్వం దృష్టిలో తన విషయాన్ని అలాగే తన నిర్ణయాన్ని స్పష్టం చెయ్యడం తో టిడిపి వర్గాలు కూడా సప్తగిరి విషయంపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు సప్తగిరికి ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం సప్తగిరి ఎమ్మెల్యేగా పోటీచేయడం ఖాయం అనేది మాత్రం స్పష్టంగా అవగతమవుతుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటికప్పుడు ప్రకటిస్తే తన సినీ కెరీర్ మీద మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్న దృష్ట్యా ఎన్నికల ముందు మాత్రమే తన నిర్ణయాన్ని మీడియా ముందు వెల్లడించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కొంతమంది నటులు మాత్రమే వైసిపి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ పార్టీ ఫాలోవర్స్ గా ఉన్నారు. కొన్నాళ్ళు సప్తగిరి కూడా వైసీపీ వెంటే ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. తన సహనటులు పోసాని కృష్ణమురళి క, ఆలీ , రచయిత కోన వెంకట్ ఇలా కీలకమైన వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. సప్తగిరి పై కూడా ఆ పార్టీ లో చేరాలనే ఒత్తిడి కూడా వచ్చినప్పటికి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉండి సినిమా మనిషిగానే మిగిలిపోయిన సప్తగిరి వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని దాదాపు సిద్ధమయ్యాడు. ఈ విషయమై అతి త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదే నిజమైతే రాజకీయాలలో మరో కమెడియన్ తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నట్లే..!