Vaisaakhi – Pakka Infotainment

బాస్ తో నెట్ ఫ్లిక్స్ షూటింగ్..!

‘మెగావర్స్‌’ పేరుతో రానున్న సెలబ్రిటీ టాక్‌ షో..?

కాలం మారింది.. టెక్నాలజీ చెలరేగి పోయింది. ఆలోచనా విధానాల్లో మార్పులొచ్చాయి. పెద్దతెర.. బుల్లితెర అన్న తారతమ్యాలు తెగిపోయాయి. యూట్యూబ్ స్టార్ నుంచి మెగాస్టార్ వరకు ఇప్పుడు అందరి ఆలోచనా ఒక్కటే.. ప్రజలతో కనెక్ట్ అయి ఉండడం. ఆ దారిలోనే ఓవైపు సినిమాలతో సూపర్ స్వింగ్ లో ఉన్న మెగాస్టార్ నెట్ ఫ్లిక్స్ కోసం ఇప్పుడు మేకప్ వేసుకుని హోస్ట్ అవతారం ఎత్తుతున్నారు.
చిరంజీవి అంటే అభిమానులకు మెగాస్టార్ మాత్రమే కాదు.. తెలువారికి ఆయనోక శకం..! విలక్షణమైన నటన, గిన్నిస్ మెచ్చిన మూమెంట్స్, ప్రేక్షకులను కట్టిపడేసే మేనరిజమ్స్ తో కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన ఆ విశ్వంభరుడు ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న వార్త ఆసక్తి రేపుతోంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ నెట్‌ఫ్లిక్స్‌లో సెలబ్రిటీ టాక్‌ షో నిర్వహించనున్నారన్న ప్రచారం టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు ‘మెగావర్స్‌’ అన్న పేరు తో రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ మంగళవారం అన్నపూర్ణ ఏడెకరాలలో మొదలయినట్లు తెలుస్తోంది. హాస్యనటుడు బ్రహ్మానందం తో ఈ టాక్ షో షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఎటువంటి వార్తలు బయటకు రానప్పటికి ఇదే ఎపిసోడ్ లో మరో హాస్యనటుడు సునీల్, సత్య లు కూడా తమ కామెడీ పంచ్ లతో అలరించబోతున్నారట. ఇదే తొలి ఎపిసోడ్ గా వస్తుందా.. మధ్యలో వస్తుందా అన్న విషయం, టైటిల్‌, స్ట్రీమింగ్ డేట్ , ఎపిసోడ్‌, సీజన్ ల సంఖ్య వంటి అంశాలపై అధికారిక ప్రకటన నెట్ ఫ్లిక్స్ నుంచి ఇంకా వెలువడాల్సి ఉంది.

ఐదు దశాబ్దాల ప్రస్థానం.. ఎన్నో మలుపులు!

1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో నటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన చిరంజీవి, కమర్షియల్‌ సినిమాలకు కొత్త శక్తిని అందించడంతో పాటు, నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యారు. 2028 నాటికి ఆయన సినీ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ‘మెగావర్స్‌’ వంటి కార్యక్రమం రూపుదిద్దుకుంటే అది కేవలం మరో టాక్‌ షోగా మాత్రమే కాకుండా, ఒక సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని ఆవిష్కరించే షో గా నిలవబోతుందన్న వాయిస్ గట్టిగానే వినిపిస్తుంది. కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందులు, సాధించిన విజయాల వెనుక ఉన్న కష్టం, పరిశ్రమలో మారుతున్న పరిస్థితులు, తనను ప్రభావితం చేసిన వ్యక్తులు వంటి ఎన్నో అంశాలపై చిరంజీవి తన అంతరంగాన్ని ఈ వేదిక ద్వారా పంచుకునే అవకాశం ఉంది.

సినిమా టూ ఓటీటీ వయా మాటీవీ..

చిరంజీవికి ప్రేక్షకులతో ప్రత్యక్షంగా సంభాషించడం ఇప్పుడే కొత్త కాదు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఆయన చేరువయ్యారు. ఇప్పుడు ‘మెగావర్స్‌’ స్ట్రీమింగ్ మొదలైతే ఆయన ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అధ్యాయం ప్రారంభమైనట్లవుతుంది.
సినిమా థియేటర్లలో పెద్ద తెరపై చూసిన అభిమానులు, టెలివిజన్‌లో ఆయనను హోస్ట్‌గా చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు ఓటీటీ వేదికపై చిరంజీవి తనదైన హాస్యంతో, ఆత్మీయమైన సంభాషణా శైలితో అతిథులను పలకరిస్తే ఎలా ఉండబోతోందో ప్రేక్షకులలో ఇప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మాణ బాధ్యతలు తీసుకుందని సమాచారం. అలాగే ఈ షో కోసం చిరంజీవికి రెండువందల కోట్ల పారితోషికం అందనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారికంగా ఈ సమాచారాన్ని ఇంతవరకు ఎవరూ ధ్రువీకరించలేదు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ నాగార్జున బిగ్ బాస్ వంటి షోలు తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, జగపతిబాబు, అలీ, వంటి ప్రముఖులు కూడా ఈ తరహా షో ల ద్వారా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి టాక్‌ షోపై అంచనాలు మరింత పెరిగాయి..
కాలానుగుణంగా కొత్త సవాళ్ళను ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వెండితెరపై చెరగని సంతకం చేసిన మెగాస్టార్‌.. డిజిటల్‌ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తారా? త్వరలో స్ట్రీమింగ్ కానున్న ‘మెగావర్స్‌’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More