Vaisaakhi – Pakka Infotainment

శివ నామ స్మరణం తో శివం భజే…

“రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
వం గంగాధరం” అంటూ సాగే శివ స్తుతికి తగ్గట్టుగా హిప్నోటైజ్ చేసేలా మ్యూజిక్ సెట్ అవ్వడంతో ఈ పాట విడుదలైన కొంత సేపటికే అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన లభించింది. వికాస్ బడిస ట్యూన్ చేసిన ఈ పాటకి రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించగా, సాయి చరణ్ పాడారు. కథలో కీలకమైన ఘట్టంలో రానున్న ఈ పాటకి తగ్గట్టుగా కట్టిపడేసే విజువల్స్ ఉంటాయని నిర్మాత తెలిపారు. అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరో – హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ నటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు ఆఖరి దశలో ఉన్న మా ‘శివం భజే’ చిత్రం ఆగస్టు 1న బ్రహ్మాండమైన విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా, ప్రమోషన్స్ లో భాగంగా మొదటి పాట ”రం రం ఈశ్వరం” ని సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఈ రోజు విడుదల చేశారు.

శివ స్తుతితో సాగే ఈ పాట విడుదలైన కొంతసేపటికే అన్ని వైపుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. పాట వింటూ ఉంటే తెలీకుండా శివ ధ్యానంలోకి వెళుతున్నట్టుగా తన్మయత్వంతో వింటున్నామని కొందరు చెప్పడం చాలా సంతోషంగా అనిపించించింది. మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస నేపథ్య గీతం, పాటలు ఈ చిత్రానికి చాలా బలమవుతాయి. పాటకి తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరథి విజువల్స్ కూడా అదే స్థాయిలో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వైవిధ్యమైన కథతో పాటు ఇండస్ట్రీ అగ్ర నిపుణులు, ఉన్నతమైన సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి చిత్రం ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించాం. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో ప్రతీ అప్డేట్ కి అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ విడుదల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More