వేరు వేరుగా జగన్, షర్మిల
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి.. అధికారం లో వున్నప్పుడు కోర్టు ల నుంచి మొట్టికాయలు వేయించుకునే ఆ పార్టీకి ఇప్పుడు అధికార తెలుగుదేశం నుంచి ప్రభుత్వం నుంచి దెబ్బలు తగులుతూనే వున్నాయి. ఇప్పుడు కుటుంబం నుంచి మళ్ళీ మరోసారి పోరు షురూ అయింది.. వైఎస్‌ఆర్ వారసత్వం పై అన్నా చెల్లెల్ల మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. ఈ నెల 8న వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఇరు వర్గాలు సమాయత్తమవుతున్నాయి విభజన అనంతరం ఏపీ లో కుదేలాయిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొద్దోగొప్పో వూపు వచ్చింది పీసీసీ ప్రెసిడెంట్ గా షర్మిల పగ్గాలు స్వీకరించిన తరువాతే. ఇప్పటి వరకు అటు షర్మిల.. ఇటు జగన్.. ఎవరికి వారు ఇడుపుల పాయ వెళ్లి..వైఎస్‌కు నివాళి అర్పించేవారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో షర్మిల వుండడంతో వైఎస్ఆర్ ని ఆ పార్టీ ఓన్ చేసుకుని తొలిసారి వైఎస్ జయంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌ను వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీ ను ప్రధానిగా చేయడమే తన లక్ష్యమని చెప్పి చివరివరకూ కాంగ్రెసు లో వున్న వైఎస్‌ఆర్ ని ఆ పార్టీ తమ ఆస్తి లా భావిస్తుంటే.. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడి గా రాజకీయాల్లోకి వచ్చి జగన్.. కాంగ్రెస్‌తో విభేదించి ఆ పార్టీ నుండి బయటకు వచ్చి వైఎస్ పేరు కలిసొచ్చేలా పార్టీని ఏర్పాటు చేసి 2014 అధికారాన్ని మిస్ అయినా 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టారు.. అంతకు ముందే ఏపీలో అంతరించుకుపోయిన కాంగ్రెస్ పార్టీ కి అభ్యర్థులు కూడా దొరకని స్థితి కి వచ్చేసింది.. కాంగ్రెస్ ను నమ్ముకున్న నాయకుల్లాగే ప్రజలు కూడా జగన్ పార్టీకి షిఫ్ట్ అయిపోయారు..
ఐదేళ్ళ తరువాత రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోని రీతిలో వైసిపి 11 సీట్లకే పరిమితమయింది. ఇదే అదనుగా ఏపీలో బలపడే ప్రయత్నం గా ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని తమ వైపుకు తిప్పుకొని పీసీసీ ప్రెసిడెంట్ నీ చేసింది. పీసీసీ చీఫ్ హోదాలో హస్తం పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పుడు షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో సీట్లురాకపోయినా గతం కంటే ఓటింగ్ శాతాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచుకుంది. . 2029 ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుండే బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటి దాకా వైఎస్ వారసత్వాన్ని, ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్‌కు..ఇకపై గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు షర్మిల. వైఎస్ జగన్, షర్మిల ఇద్దరూ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులే. కష్టాల్లో ఉన్న అన్నకు అండగా నిలబడటం కోసం రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల.. వైఎస్సార్సీపీ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అయితే అన్నతో దూరం పెరగడంతో కాంగ్రెస్ గూటికి చేరిన షర్మిల.. వైఎస్ తనయగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే బాధ్యతను తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ అభిమానులను గతంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తిరిగి హస్తం వైపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో తొలి అడుగుగా..తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను షర్మిల ఉపయోగించుకోబోతున్నారు. జులై 8న విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వంటి కీలక నేతలను స్వయంగా ఆహ్వానించారు.. ఇదే వేదిక పై వైఎస్ఆర్ సీపీ పూర్వ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.. ఇదే జరిగితే వైఎస్ఆర్ సీపీ కి మరో దెబ్బ పడే పరిస్థితి వున్నట్టే…!