నెల్లూరు వేదికగా ఫోన్ టాపింగ్ వ్యవహారంపై గళమెత్తిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పార్టీ నుండి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తమైనట్లు స్వయంగా ఆయనే చెప్పడం పార్టీలో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది. దాదాపు రెండున్నర ఏళ్ల క్రితమే ఫోన్ టాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోమ్ శాఖకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాయడం దగ్గర నుండి ఏపీలో ఫోన్ టాపింగ్ వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. విపక్ష నాయకులు, మీడియా ప్రతినిధులు, కొంతమంది న్యాయనిపుణుల ఫోన్లను రహస్యంగా వింటున్నారని ప్రతిపక్షనేత చెప్పడం ఒక ఎత్తైతే ఇప్పుడు స్వపక్ష శాసనసభ్యులే తమ ఫోన్లు టాపింగ్ కు గురవుతున్నాయని ప్రకటించడం.. వారిలో ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ఈ విషయంపై మీడియాకు ఎక్కడం అధికార పార్టీలో కాకరేపింది. ఈ వివాదం అంతటితో ఆగకుండా తనకి ఇద్దరు మంత్రులు, రఘురామకృష్ణంరాజు కాకుండా నలుగురు పార్లమెంట్ సభ్యులు, మరో 30 మంది శాసనసభ్యులు సంఘీభావం తెలపడమే కాకుండా వారు కూడా ఇదే విషయంపై వాపోయారని ఆయన చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాళ్లు కూడా ఇప్పుడు నార్మల్ ఫోన్లు కాకుండా వాట్సప్ కాల్స్ తోను ఫేస్ టైం యాప్ తో మాట్లాడుతున్నారని చెప్పినట్లు కోటంరెడ్డి చెప్పడం మిగిలిన అందరిలోనూ గూబులు రేపింది. దేశ రక్షణ విషయంలో మాత్రమే అనుమతులతో ఫోన్ ట్యాప్ లేక రహస్యంగా వినడం వంటివి చేసే అవకాశం ఉంటుందే తప్ప ఇలా ఫోన్ టాపింగ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విశ్లేషకులు చెప్తున్నారు. కర్ణాటకలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని సెక్షన్ 5 టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 498 ఏ ప్రకారం ఇది చాలా సీరియస్ వ్యవహారం అని వారంటున్నారు… రాష్ట్రంలో సంచలన సృష్టించిన ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది వైసీపీ లో రేగిన ఈ కాకా పై కొంతమంది ఓపెన్ అవుతుండగా మరి కొంత మంది మౌనంగా పరిస్థితులను గమనిస్తున్నారు. కొంతమంది మంత్రులు మాజీ మంత్రులు టాపింగే అసలు జరగలేదని.. అది కేవలం రికార్డింగ్ మాత్రమే అని ఈ వ్యవహారంపై మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారం గా ఎటువంటి ప్రకటన రాకపోవడంపై గుర్రుమంటున్నాయి ఇదిలా ఉండగా కోటంరెడ్డికి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించిన ఆ అధికార పార్టీ నేతలు ఎవరు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.