రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
‘‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగుజాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరు. విధ్వంసానికి జగన్ ఒక కేస్ స్టడీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో రాజధాని అమరావతిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుదని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు ఎంతో పరిశీలన చేశాక చరిత్ర సృష్టిస్తుందని అమరావతి పేరును సూచించారు. దానికి రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుండి నీరు, మట్టి తెచ్చాం. దేశంలోని అన్ని పవిత్రమైన ప్రదేశాల నుండి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చాం. కొంతమంది అమరావతే రాజధానిగా ఎందుకు ఉండాలని అడుగుతున్నారు…కుప్పం వారికైనా…ఇచ్చాపురం వారికైనా సమదూరంగా అమరావతి ఉంటుంది. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరు. రాజధానికి రెండు వైపులా 12 చొప్పున పార్లమెంట్ లు ఉన్నాయి. విభజన అనంతరం శివరామృష్ణ కమిటి రాష్ట్రంలో పర్యటిస్తే…కృష్ణా, గుంటూరు లేదా ఆ రెండు జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది తమ అభిప్రాయాలను చెప్పారు. అప్పటికే రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉంది. సైబరాబాద్ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించాం. హైదరాబాద్ కు నాడు సరిగా కరెంట్, నీళ్లు లేవు…రానురాను అన్నీ కలిసొచ్చాయి. ఎంతో మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్ కు తీసుకొచ్చాం. 14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ గురించి వివరించి పరిశ్రమలు తీసుకొచ్చాం. పెద్దపెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాం. నా హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశా. అమరావతికి ల్యాండ్ పూలింగ్ సాధ్యమవుతుందా అని అనుమానపడ్డాం. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను రైతులు ముందుకొచ్చి ఇచ్చారు. పదేళ్ల పాటు రైతులకు కౌలు ఇవ్వాలని నిర్ణయించాం. వ్యయసాయ కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్ అందించాం…ఈ నెల 1వ తేదీనే దాన్ని రూ.5000కు పెంచి అందించాం. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా సరే అమరావతిని రాజధానిగా ఒప్పుకోవాల్సిందే.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఉద్యోగ కల్పనకు నిలయంగా రాజధాని రూపకల్పన
‘‘రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885, రిటర్నబుల్ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు ఉంటుంది. ప్రభుత్వం వద్దనున్న భూమిని విక్రయించి కూడా రాజధాని నిర్మాణం చేయొచ్చని ఆలోచించాం. కేంద్ర ప్రభుత్వం కేపిటెల్ గెయిన్ మినహాయింపు ఇచ్చింది. రూ.2,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుని రూ.1500 కోట్లు కూడా అందించింది. రాష్ట్రం నడిమద్యలో రాజధాని ఉండాలని నాడు అసెంబ్లీలో జగన్ అన్నారు. నేను ఇల్లు కట్టుకున్నా…మీరు కట్టుకోలేదు అని నన్ను అన్నారు. కానీ తర్వాత ఏం నిర్ణయాలు తీసుకుని ఎలా మాటలు మార్చారో అంతా చూశాం. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జెఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయి. సింగపూర్ తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. మొదట సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ అందించింది. నవ నగరాలకు రూపకల్పన చేసి మాస్టర్ ప్లాన్ అందించారు. దేశంలోనే స్మార్ట్ సిటీగా, ప్రపంచ స్థాయి నగరంగా ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్ రూపొందించాం. పరిశ్రమలతో పాటు ఉద్యోగాల కల్పన కేంద్రంగా నిర్ణయించాం. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలని రూపొందించాం. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ తో పాటు అన్ని విభాగాలు ఒక చోట ఉండాలని మాస్టర్ ప్లాన్ లో నిర్ణయించాం. ఇందులో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఏ సిటీకి కి.మీ మేర నదుల అవకాశం లేదు…కానీ అమరావతికి ఉంది. రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్ తో రూపకల్పన చేశాం. రూ.51,687 కోట్లతో రాజధానులకు అంచనా వేసి రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచాం. అప్పటికి జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించాం…రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగులో ఉన్నాయి.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
విధ్వంసం ప్రారంభం
‘‘2019లో అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభించారు. కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ప్రజావేదికను కూల్చేశారు. తర్వాత మూడు రాజధానులు ప్రకటించారు. జీఎన్.రావు, బోస్టన్ కమిటీ అంటూ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజావేదిక శిధిలాలను తొలగించవద్దని ఇప్పుడు అంతా చెప్తున్నారు. అది చూస్తే ప్రతి ఒక్కరిలో గత ప్రభుత్వ విధ్వంసం గుర్తుకురావాలి. 1631 రోజుల పాటు రాజధానికి భూములిచ్చిన రైతులు పోరాటం చేశారు. జగన్ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారు. తిరుపతి యాత్రకు వెళితే ఉండటానికి మండపాలు ఇవ్వకుండా వేధించారు. అరసవెళ్లి యాత్రకు వెళితే దాడులు చేసి మధ్యలోనే నిలిపేయించారు.’’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే నిర్మాణాలకు గ్రహణం
‘‘గత పాలకులు అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారు. వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేశారు. రూ.వెయ్యి కోట్లు గ్రాంట్ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశారు. సింగపూర్ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారు. 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్ ను నాశనం చేశారు. అది పూర్తైతే ప్రభుత్వానికి రూ.57.37 కోట్లు ఆదాయం వచ్చేది..మున్ముందు రూ.885 కోట్లకు పెరిగేది. కానీ దాన్ని కూడా నాశనం చేయడంతో ఇప్పుడు రూ.164.5 కోట్లు నష్టం, రాజధాని పరిధిలోని రోడ్లు, బిల్డింగులు డ్యామేజ్ అయ్యాయి’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్
‘‘గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసంతో రాజధాని నిర్మాణం ఖర్చు పెరిగింది. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. పెట్టుబడి దారుల్లో నమ్మకం సన్నగిల్లింది. వెల్త్ జనరేషన్ పెరగలేదు. చిన్నపాటి ఉపాధికి కూడా పక్కరాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది. అన్ని రంగాలు రివర్స్ అయ్యాయి. నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలో ఉన్న పనులు పూర్తవ్వలేదు. రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. చివరకు రోడ్లను కూడా వదలకుండా తవ్వుకుపోయారు. ఏపీలో భూముల విలువ కూడా తగ్గిపోయింది. హైకోర్టు, హెచ్ఓడీ, సచివాలయాలకు సంబంధించిన ఐకానిక్ పునాదులు అన్నీ నీళ్లలో ముంచారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు పూర్తి చేయలేదు. గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జిల కోసం నిర్మించతలపెట్టిన వాటిని కూడా అర్థాంతరంగా నిలిపేశారు. 2019లో ఎక్కడున్న పనులు ఐదేళ్ల పాటు అక్కడే ఉన్నాయి.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
జగన్ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదు
చరిత్ర తలచుకుంటే బాధగా ఉంది. చేసిన కష్టం వృధా అయింది. అది చూస్తే మనసు నిగ్రహం చేసుకోలేని పరిస్థితి. ఇది తెలుగుజాతికి చేసిన ద్రోహం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రం నిలబడాలని పని చేశాం. పదేళ్లుగా రాజధాని లేదు. ఉమ్మడి రాజధాని కాలం కూడా అయిపోంది. పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. సింగపూర్ ప్రతినిధులు వస్తారో రారో తెలీదు. ఈ దుర్మార్గులు మళ్లీ వస్తే తమ పరిస్థితి ఏంటో అన్న ఆలోచనలో పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం మనది. వెయ్యి కి.మీ సముద్ర తీరం ఉంది. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా.? నన్ను ఇబ్బందులు పెట్టారని నేను మాట్లాడలేదు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదు.
బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది
‘‘రాష్ట్ర అభివృద్ధిపై ప్రజలకు కూడా నమ్మకం రావాలి…అప్పుడే రాష్ట్రం నిలబడుతుంది. గత పాలకులు బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ప్రజా రాజధాని ఏ ఒక్కరి కోసం కాదు. ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన అమరావతి వల్లే సాధ్యం అవుతుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ప్రతి పంచాయతీ సంక్షేమానికి రాజధాని నిక్షేపంలా ఉంటుంది. ప్రతి తెలుగుబిడ్డ గర్వించే ప్రపంచస్థాయి నగరం అమరావతి ఉండాలన్న లక్ష్యంతో పని చేశాం. నాది అమరావతి అని చెప్పుకునేలా ప్రణాళిక రూపొందించాం. మాస్టర్ ప్లాన్ లో మార్పులు లేవు…ఇదే మాస్టర్ ప్లాన్ ను కొనసాగిస్తాం. ఇక్కడ భూములమ్మిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొంటే అక్కడ కూడా విలువ పెరుగుతుంది…సైక్లింగ్ విధానం నడుస్తుంది. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగి ఉంటే ప్రభుత్వానికి కూడా పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. విట్, ఎస్ఆర్, అమృత్ లాంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలు చదువుకుంటే కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయి. రాజధాని పునర్నిర్మానంపై కేంద్రంతో కూడా మాట్లాడతాం. అమరావతి ప్రాంతాన్ని ఏ దుష్టశక్తి అడ్డుకోవద్దని వేడుకున్నా…కానీ ఐదేళ్లు ఇబ్బంది పడ్డాం.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
వ్యవస్థలు ఇంత పతనానికి చేరడాన్ని ఎప్పుడూ చూడలేదు
‘‘రాజధాని పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుండే పనులు ప్రారంభిస్తాం తప్ప…వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. న్యాయ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి సెంటు పట్టాలని డ్రామాలాడారు…ఇల్లు లేని వారికి వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తాం. మా కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాను…కానీ ఎప్పుడూ ఇంతలా వ్యవస్థలు పతనావస్థకు చేరిన సందర్భం చూడలేదు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ కు కూడా నీళ్లివ్వకుండా గత ప్రభుత్వం వేధించింది. పడకల పెరుగుదలకు అవరోధం ఏర్పడి ఆసుపత్రిలో ఓపీలు కూడా తగ్గాయి.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.