Vaisaakhi – Pakka Infotainment

రాఖీపూర్ణిమ విశిష్ఠత ఏంటి..?

ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈరోజును రాఖీ పౌర్ణమి గా జంధ్యాల పౌర్ణమి గా రెండు విశేషాల కలబోతగా ఈ విశిష్ట దినాన్ని జరుపుకుంటారు.. రాఖీ పర్వదినానికి సంభందించి పురాణ కథనం ఒకటి ప్రచారంలో వుంది.. ఆ కాలంలో దేవతలకు , అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో పరాజితుడైన దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకుంటే భర్త నిస్సాహాయత ను చూసిన శచీదేవి సమరానికి పురిగొల్పి శ్రావణ పౌర్ణమి సందర్భంగా పార్వతీ పరమేశ్వరులను , లక్ష్మీనారాయణులను పూజించిన రక్షాను దేవేంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి ప్రోత్సహిస్తుంది.. ఆ దృశ్యాన్ని చూసినదేవతలందరూ కూడా వాళ్ళు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి అసుర గణంపై యుద్ధానికి పంపుతారు. ఆ రక్ష ల రక్షణతో సమరంలో విజయం సాధించి ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ఇంద్రుడికి కట్టిన శ్రావణ పౌర్ణమి ని రాఖీ(రక్షా బంధన్) పౌర్ణమి జరుపుకోవడం ఆచారం గా మారింది. ఇదిలా వుంటే ద్వాపర యుగంలో ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుని చూపుడు వేలుకు గాయమై రక్తం ధారగా కారుతుండటం తో గమనించిన ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడట..ఆ మాట ప్రకారమే దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడాడు.. అలాగే మరో కథనం కూడా చెప్తుంటారు.

సర్వ విద్యా స్వరూపుడైన హయగ్రీవ అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు , శాస్త్రాలకు మూలం వేదం. అలాంటి వేదాల్ని లోకానికి అందించిన అవతారమే హయగ్రీవ అవతారం. ఆ జ్ఞాన సమపార్జన కోసం
విద్య ని అభ్యసించే వారందరికీ ఈజ్ఞాననికి రక్షకులు గా వుండమని కోరుతూ శ్రావణ పూర్ణిమ హయగ్రీవ జయంతి రోజున రక్ష కట్టే పద్ధతినే రక్షబంధనం అయ్యిందనీ, మరికొంత మంది వేదాంతులు చెప్తుంటారు. అలాగే శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతే శ్రీమహాలక్ష్మి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి , తన భర్తను వైకుంఠానికి తీసుకొని వెళ్ళడం వలనే రక్షాబంధానికి ప్రాధాన్యత ఏర్పడిందని కూడా పండితులు చెపుతుంటారు..
” యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల” అంటూ రక్ష కోరిన తన సోదరిని బలి చక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురు నిలిచాడని అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తనకి రక్షణ నివ్వమని కోరుతుందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారం లో వున్నాయి ఏది ఏమైనా రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు.

జంధ్యాన్ని ఎందుకు మార్చుకోవాలి..?

జంధ్యాన్ని ధరించే కొన్ని వర్ణాల వారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోప‌వీతం పేరుతో పిలుస్తారు. అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద్యాధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. యఙ్ఞోప‌వీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యఙ్ఞోపవీతం దివ్యౌషధం. ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More