ఏప్రిల్ 26 వరకు మ్రోగిన పెళ్లి వాయిద్యాలు… కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొనున్నాయి.. దాదాపు మూడునెలల మూఢం కారణంగా ఆగష్టు 8 నుంచి సెప్టెంబర్ 6 మధ్యలో మాత్రమే పెళ్ళిళ్ళకి అవకాశం ఉంది.. ఈ మూఢం పెళ్ళిళ్ళకి మాత్రమే అడ్డా..? లేక ఏ శుభకార్యము చెయ్యకూడదా.. అసలీ మూఢం అంటే ఏంటి.? ఇది మంచా..? చెడా..? మూఢమి అని ఎలా నిర్ధేశిస్తారు…?సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ పరిభ్రమిస్తాయి.. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అని అంటారు ఇందులో గురు మౌఢ్యమి ,శుక్ర మౌఢ్యమి, అని రెండు ఉంటాయి.. ఈ తేడా ఎలా అంటే గ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యునికి దగ్గరగా శుభ గ్రహాలైన గురు , శుక్రులు వచ్చి నప్పుడు , ఆయా గ్రహాల శక్తులు బలహీనమై నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిల్లుతుంది. అంటే వేయి వాట్స్ బల్బు ముందు క్యాండిల్ పెడితే , ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది. గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం… ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదన్నది పండితుల మాట. అయితే ఈ సమయంలో ఈ కార్యక్రమాలు చేస్తే మంచి.. ఏవి చెయ్యకూడదు అన్న విషయానికి వస్తే గురు, శుక్ర మూఢాల్లో ముఖ్యంగా వివాహాది శుభ కార్యాలు జరపకూడదు.. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోవటం గాని లగ్నపత్రిక రాసుకోవడం కానీ చేయకూడదు.. అలాగే చంటిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు గృహ శంకుస్థాపనలు గాని ఇల్లు మారడం వంటివి చెయ్యకూడదు.. అయితే చిన్నపిల్లలకు అన్న ప్రాసన చేయించవచ్చు ఇంటి రిపేర్లు చేయడం,భూములు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు చేసుకోవడం వంటివి చేసుకోవచ్చు..కొత్త ఉద్యోగాల్లో చేరడం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లడం వాహనాలు వస్త్రాలు కొనుగోలు యధావిధిగా చెయ్యొచ్చు..అయితే మహర్షులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం ఈ కాలంలో ఏదైనా శుభకార్యాలు చేస్తే అశుభం వినాల్సి రావొచ్చని కష్టనష్టాలు కలుగవచ్చు పండితులు చెబుతుంటారు.. అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టరు. ముఖ్యంగా వివాహాల జోలికి అసలు పోరు..