నిన్న మొన్నటి వరకు అన్నా, బావ, తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళు నేడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. అది ఎంతలా అంటే చివరకు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంతవరకు, వ్యక్తిగత దూషణలు చేసుకునేంతవరకు, నీ అంతు చూస్తా అని బెదిరించుకునేంతవరకు.. ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోప, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి అంటూ గత చరిత్రను తవ్వి తీసుకుంటూ అభాస పాలవుతున్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం (విజేఎఫ్) ఎన్నికలు, పాలకవర్గం పై అవినీతి ఆరోపణల అజెండాగా విశాఖ నగర జర్నలిస్టుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. గత 12 ఏళ్లుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలను నిర్వహించకుండా పాలకవర్గం కొనసాగడంపై అలాగే ప్రస్తుతం కమిటీ పై అదే స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం ఆ ఆరోపణలు తిప్పికొడుతూ దానికి తగిన సమాధానాన్ని ఇస్తూ తమ వైపు ఎటువంటి తప్పు జరగలేదని వివరణ ఇస్తుంది. గత ఎన్నికల సమయంలో కూడా ఇంతే హడావిడి జరిగింది. కోర్టు కేసుల ద్వారా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ చాన్నాళ్లకు ఎన్నికల ఘట్టం తెరపైకి వచ్చింది. ఈ ఏడాది తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రస్తుత కమిటీ ప్రకటించింది. ఆ ప్రకటనే ఇప్పుడు వివాదానికి కారణం అవుతుంది. పోటీలో నిలబడాలని అనుకునేవాళ్లు ఆ ప్రకటన వచ్చిన వెంటనే తాము ఫలానా దానికి పోటీ చేస్తున్నామనే విషయాన్ని చెప్పి మరి ప్రచారాలను మొదలెట్టేసారు. కొద్దిరోజులు జరిగిన ఈ హడావిడి తర్వాత ప్రస్తుత కమిటీ చేసిన అవినీతి, అక్రమాలపై నిగ్గు తెల్చేందుకు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కొందరు సీనియర్ జర్నలిస్టులు రంగంలోకి దిగారు. అప్పటివరకు కనిపించిన ఎన్నికల హడావుడి తర్వాత అది ప్రస్తుత కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలపై పోరాటంగా మారింది. సీనియర్ లందరూ ఒకవైపు, ప్రెస్ క్లబ్ కమిటీ మరొకవైపుగా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దూషణల పర్వం మొదలుపెట్టారు. మీడియా వాట్సప్ గ్రూపులలో ఇరు వర్గాలకు చెందిన వారు రాయలేని భాషను వాడుతూ దారుణంగా మెసేజ్లు చేస్తూ తమ పరువును తామే తీసుకుంటున్నారు. జుగుప్సాకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ వ్యక్తిగతంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ రోడ్డున పడ్డారు. అయితే చివరగా రెండు వర్గాలు చెప్పేది ఒకటే. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి. ఎవరికి ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలి అనేది వారి అభిప్రాయం. కానీ సీనియర్ల వర్గం నుంచి పాత కమిటీ ఎన్నికలలో నిలబడకూడదు. వాళ్లు స్వచ్ఛందంగా తప్పుకున్న తర్వాతే ఎన్నికల జరగాలనేది వారి డిమాండ్. కానీ దీనికి ప్రస్తుత పాలకవర్గం దీనికి అభ్యంతరం చెబుతుంది. మొన్నటి వరకు ఎన్నికలు జరగలేదని రభస చేశారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని చెబితే ఏదో ఒక కొర్రీ పెట్టి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని పాలకవర్గం ఆరోపిస్తుంది. దీనికి తోడు పాలకవర్గం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేస్తూ సీనియర్ పాత్రికేయుల బృందం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు అలాగే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ప్రస్తుత కమిటీ కూడా కలెక్టర్ ను కలిసి తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చింది. మొత్తానికి కలెక్టర్ ప్రెస్ క్లబ్ కమిటీపై వస్తున్న ఆరోపణల పై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇరువర్గాలను విచారించింది. నివేదికను కలెక్టర్ కు అందజేసింది. దీనిపై రిజల్ట్ మాత్రం పెండింగ్ లో ఉంది నేడో రేపో కమిటీ నివేదికను బహిర్గతం చేయనున్నారు. ఆ రిజల్ట్ కోసమే ఇరు వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉండగా రహాస్యంగా విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ తమకు అందజేసిన ప్రెస్ క్లబ్ కమిటీ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు అవతల వర్గం చేతులోకి వెళ్లడం, వాటిని వాళ్లు వివిధ వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేయడం జరిగింది. కమిటీ సభ్యులు దగ్గర ఉండవలసిన ఆ పేపర్లు అవతల వర్గానికి ఎలా వెళ్లాయని పాలక వర్గం సందేహ పడుతుంది. ఏదేమైనప్పటికీ సాధ్యమైనంత మేర ఎన్నికలను త్వరగా నిర్వహించాలని ప్రస్తుత పాలకవర్గం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో సభ్యుల రెన్యువల్ కార్యక్రమాన్ని అలాగే కొత్త సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సుమారు మూడు రోజుల పాటు కొనసాగించింది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిటీ సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం చట్ట విరుద్ధమని సీనియర్ ల వర్గానికి చెందిన కొందరు పాత్రికేయులు బాహాటంగానే చెబుతున్నారు. కలిసిమెలిసి ఉండవలసిన పాత్రికేయులు అందరూ ప్రెస్ క్లబ్ పై ఆధిపత్యం కోసం ఇలా ఒకరినొకరు తిట్టి పోసుకుంటూ, వాట్సప్ గ్రూపులలో అసభ్య పదజాలంతో మెసేజ్ లు పెట్టుకుంటూ రోడ్డున పడడం చాలా విచారకరం. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ కార్డులు కోసమో, ఇళ్ల స్థలాల కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ కోసమో లేదా కళాశాలలో, పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు రాయితీల కోసమో, వారి హక్కుల కోసమో, వారి ఉద్యోగ భద్రత కోసమో లేదా రక్షణ కోసమో ఇలా అందరూ ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేస్తే అందరూ హర్షించేవారు. కానీ వారి స్వప్రయోజనాల కోసం, ప్రెస్ క్లబ్ పై ఆదిపత్యం కోసం పోరాటం చేయడమే హాస్యాస్పదంగా ఉంది. జర్నలిస్టుల సమస్యలను గాలికి వదిలేసి ప్రెస్ క్లబ్ పేరిట వివాదాలను రాజేసుకుంటూ ఇలా రోడ్డున పడటం దురదృష్టకరం.
previous post
next post