ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో ఏ ఏడాదికి ఆ ఏడాది నేరాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ నేరాలు నియంత్రణలోకి రావడం లేదు. పోలీస్ కమిషనర్లు మారుతున్నప్పటికీ ఇక్కడి పరిస్థితులు మాత్రం మారడం లేదు. గత ఐదేళ్ల కాలంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నేరస్తులు టెక్నాలజీ సాయంతో తమ తెలివితేటలు ఉపయోగించి పోలీసులకు దొరకకుండా వరుస నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో చోరీలు, కొట్లాటలు, కుటుంబ గొడవలు, దారి దోపిడీలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. కానీ నేడు వాటికి మించి ఇక్కడ నేరాలు జరుగుతున్నాయి. అంటే వరుస హత్యలు జరుగుతూ నగర ప్రజలను భయపెడుతున్నాయి. పాత నేరస్తులు, రౌడీషీటర్లు ఎక్కువగా ఈ హత్యలకు గురవుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా నడిరోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా అతి కిరాతకంగా హత్యలు చేస్తూ నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారు. తాము ఎప్పటికైనా పోలీసులకు దొరికిపోతామని తెలిసినా సరే భయం లేకుండా హత్యలు చేస్తున్నారు. ఒకవేళ జైలుకు వెళ్లిన బెయిల్ పై తిరిగి వచ్చేయవచ్చు అనే ధీమా ఉండటంతో పోలీసులకు భయపడటం లేదు. ఇటీవల విశాఖలో రౌడీ గ్యాంగ్ల హడావిడి ఎక్కువ అయ్యింది. ఈ గ్యాంగ్ ల మధ్య ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఎదురుపడితే వాగ్వాదం చేసుకోవడం లేదా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరుగుతుంది. లేదా హత్యలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. విశాఖలో ఇటువంటి గ్యాంగుల మధ్య జరిగిన గొడవల కారణంగా కొన్ని హత్యలు జరిగాయి. విశాఖ ఆరిలోవ ప్రాంతం లో గతంలో జరిగిన కొన్ని హత్యలు స్థానికులను ఎంత భయపెట్టాయో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థులను బహిరంగంగా నడిరోడ్డుపై వెంటాడి కత్తులతో నరికి చంపిన ఘటనలు వరుసగా జరిగాయి. ఇక మధురవాడ ప్రాంతం అలాగే ఎంవిపి కాలనీ గాజువాక, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, కొబ్బరి తోట, వన్ టౌన్ ఏరియా, కంచరపాలెం వంటి ప్రాంతాలలో గతంలో కొన్ని ఇటువంటి హత్యలు చోటు చేసుకున్నాయి. పోలీస్ నిఘా ఉన్నప్పటికీ కూడా జరగాల్సిన దారుణాలు జరిగిపోతున్నాయి. సంఘటనలు జరిగాక మాత్రమే అక్కడికి పోలీసులు వస్తూ ఉండటం జరుగుతుంది. విశాఖలో డిటి నాయక్ సిపి గా పని చేసిన సమయంలో నేరస్తులు ఏదైనా నేరం చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉండేవి. స్పెషల్ టాస్క్ఫోర్స్(STF) ను ఏర్పాటు చేసి గడగడ లాడించేవారు ఆ సమయంలో నలుగురు కలిసి వెళ్లిన అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించేవారు. రాత్రి 10 దాటిన తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వదిలేవారు కాదు. నేరస్థులకు భయాన్ని రుచి చూపించారు డిటి నాయక్. ఆయన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తర్వాత ఎంతమంది సీపీలుగా ఇక్కడికి వచ్చినప్పుడు నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. నేరాలను కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సరే నేరస్తులు బరితెగించి వరుస నేరాలకు పాల్పడుతూ ఉండటం జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పోలీసు గస్తీ నిర్వహించాలి. నిఘాను మరింతగా పెంచాలి. రాత్రి గస్తీ తప్పనిసరి చేయాలి. నేరస్తులు, రౌడీ షీటర్ల పై నిఘా పెట్టాలి. కానీ వాస్తవంగా చూస్తే అవేమీ కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల రికమండేషన్ తో పోస్టింగులు సంపాదించిన కొందరు పోలీసు అధికారులు తమ ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప నేరాలను నియంత్రించడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిజాయితీగా పనిచేసే వాళ్లకు మాత్రం ప్రియారిటి ఇవ్వకపోవడంతో ఇక్కడ సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీసు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు..
next post