ప్రశాంతతకు మారుపేరైన విశాఖలోని ప్రముఖులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటునుంచి ఎలా, ఎవరి నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయపడుతున్నారు. పోలీసు వ్యవస్ధ, అధికారగణం ఇచ్చే భద్రత ను పక్కన పెడితే తమ సెక్యూరిటీ ని తామే చూసుకునే పనిలో పడ్డారు.. చాలామంది ఇప్పటికే ప్రయివేట్ సెక్యూరిటీ ని ఏర్పాటు చేసుకోగా మరికొంతమంది ఇప్పుడు గన్ లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.. నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరగడం..నేరస్తులు బరితెగించి విచ్చలవిడిగా వ్యవహరించడం మరిముఖ్యంగా విశాఖలో ఉన్న రౌడీషీటర్లకు, కొంతమంది ప్రజా ప్రతినిధులకు ఉన్న సత్సంబంధాలు మరిన్ని నేరాలు పెరగడానికి కారణమవుతున్నాయి. రాజకీయ , రియల్ ఎస్టేట్ ప్రముఖులు కొందరు తమ వ్యాపారాలకు ఇతరుల వలన సమస్యలు తలెత్తకూడదని రౌడీ షీటర్లకు ఆశ్రయం ఇచ్చి డీల్ ప్రకారం కొంత నగదును వారికి ముట్ట చెబుతున్నారు. దీంతో నేతలు చెప్పిన పనులను రౌడీషీటర్లు తమ మనుషులతో కలిసి వెళ్లి విజయవంతంగా చేసుకుని తిరిగి వస్తున్నారు. దీనికి తోడు విశాఖను రాజధాని ప్రకటించడంతో ఇక్కడ భూమి రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోవడం కూడా వీళ్ళకి కలిసొచ్చిన అంశం.. ఇప్పుడు అందరి కళ్ళు ఇక్కడ ఖాళీ స్థలాల పై పడి అటు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా కబ్జాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే జరిగిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఎటువంటి రాజకీయ కోణం లేదని కేవలం డబ్బు కోసమే జరగడం తో నగరంలో గల చాలా మంది ప్రముఖులు ఆందోళన చెంది తమ ఆత్మ రక్షణ కోసం గన్ లైసెన్సులు కావాలని కమిషనరేట్ చుట్టూ తిరుగుతున్నారు. కిడ్నాప్ సంఘటన తరువాత తన కుమారుడు శరత్ వ్యక్తిగత భద్రత నేపధ్యంలో గన్ లైసెన్సు జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీ ఇటీవల వెల్లడించారు. పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మూడు నెలల క్రితం గన్ లైసెన్సు విషయంలో నిర్ణయం తీసుకోగా, నెల కిందట దరఖాస్తు పెట్టినట్లు సమాచారం. నగరంలో ఇప్పటి వరకు 300 పైగా గన్ లైసెన్సులు ఉంటే ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనతో గత పదిరోజులుగా కొత్తగా దరఖాస్తులు పుంఖానుపుంఖాలుగా అందుతున్నట్లు సమాచారం. వెంటనే లైసెన్సు మంజూరు చేయాలనే సిఫార్సులతో అభ్యర్ధనలతో దరఖాస్తుల సంఖ్య పెరిగనట్లు తెలుస్తోంది. పోలీస్ కమిషనర్ కు వచ్చే దరఖాస్తులను స్పెషల్ బ్రాంచీకి పంపి విచారణ చేయించాల్సి ఉంటుంది. 2021లో 37 హత్యలు, 2022లో 38 హత్యలు జరిగాయి. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో 15 జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మరో వైపు గంజాయి నిల్వ రవాణాకు నగరం కేరాఫ్ గా మారడం కూడా కలవర పరిచే విషయం. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ హేమంత్ గతేడాది జూన్ లో భీమిలికి చెందిన తెదేపా నేతను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ రూ. కోటి డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో రియల్టర్ ను ప్లాటు అమ్ముతానంటూ పిలిచి కిడ్నాప్ చేసి రూ. 7.50 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల ఎంపీ కుటుంబీకులనుంచి కోటిన్నరకు పైగా వసూలు చేశాడు. కిడ్నాప్ చేస్తే పెద్ద అమౌంట్ ఎవరు ఇస్తారు అన్నది తెలుసుకొని మరి ఈ కిడ్నాప్ లు జరుగుతూ ఉండటం విశేషం. నేరాలకు పాల్పడే రౌడీ షీటర్ లను వదిలే ప్రసక్తి లేదని మరోపక్క పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికి ఎటువంటి భయం లేకుండా నేరస్తులు వరుసగా నేరాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ నేరం చేసి అరెస్టయి జైలుకు వెళ్లిన 15 రోజులలోపు బెయిల్ పై తిరిగి వచ్చేస్తామని ధీమాగా చెబుతున్నారు. స్థానిక నేరస్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తులు కూడా కలవడంతో ఇక్కడ నేరాలు సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వం విశాఖ పై దృష్టి సారించి పోలీస్ శాఖను అప్రమత్తం చేసి నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు నేరస్తులపై ఉక్కు పాదం మోపే విధంగా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
previous post